సంగారెడ్డి, అందోల్ ఆర్డిఓ కార్యాలయాలు తనిఖీ
ప్రత్యేక ఓటర్ నమోదు పరిశీలన
సంగారెడ్డి కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశం
సంగారెడ్డి (విజయక్రాంతి): పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నూతన ఓటర్ నమోదు, ఎమ్మెల్సీ ఓటర్ నమోదు వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు కలెక్టర్ క్రాంతి వల్లూరు వివరించారు. శనివారం సంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ నమోదు క్యాంపెనింగ్ లను సంగారెడ్డి, ఆందోల్ నియోజకవర్గాలలో పర్యటించి తెలుసుకున్నారు. సంగారెడ్డి, ఆందోల్ ఆర్డీవో కార్యాలయాలను సందర్శించి కార్యాలయాలలో నూతన ఓటరు నమోదును పరిశీలించారు. ఆన్లైన్ వేగవంతంగా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సంగారెడ్డి తార డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు.
స్థానిక బిఎల్ఓలతో మాట్లాడి ఫారం 6, 7, 8 ఆన్లైన్, సాధారణ దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డిలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన ఈవీఎంలను పరిశీలించారు. సంగారెడ్డి సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశం అయ్యారు. జిల్లాలో ఎస్ ఎస్ ఆర్ 2025 ఓటరు నమోదు వివరాలు, ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు వివరాలు తదితర అంశాలను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల ప్రధాన అధికారికి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు జిల్లాలోని ఆర్డీవోలు పాల్గొన్నారు.