calender_icon.png 9 April, 2025 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలివేటెడ్ కారిడారే!

07-04-2025 01:24:44 AM

హైదరాబాద్-శ్రీశైలం హైవే నిర్మాణంలో అధికారుల యోచన

  1. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం తర్వాత ‘సొరంగ రహదారి’పై విముఖత
  2. కేంద్ర ప్రభుత్వం సైతం గ్రీన్ సిగ్నల్ 
  3. హైవే నిర్మాణంతో తగ్గనున్న 17.5 కి.మీ దూరం
  4. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి కేవలం 3 గంటల్లో చేరుకునే అవకాశం

హైదరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగిపోయింది.. మరోవైపు నల్లమల అభ యారణ్యంలో రాత్రిపూట వాహనాలు వెళ్లేందుకు అటవీశాఖ నిషేధించింది. దీంతో రాత్రి 9 గంటలు దాటిందంటే అన్ని వాహనాలు నల్లమల ప్రవేశద్వారమైన మన్ననూరు వద్ద ఆగిపోవాల్సిందే.

ఇక పగటిపూట అయినా ప్రయాణం సాఫీగా సాగుతుందా అంటే అదీ లేదు. కేవలం రెండు లేన్ల రోడ్డు కావడం, భారీ ఘాట్లు, అత్యంత ప్రమాదకరమైన మలుపులకు తోడు అడుగడుగునా స్పీడ్ బ్రేకర్లతో నల్లమలలో దాదాపు 80 కి.మీ ప్రయాణానికి 3 నుంచి 5 గంటల వరకు సమయం పడుతోంది. ఇక వారాంతాలు, పర్వదినాల సమయంలో ఈ మార్గంలో ప్రయాణించి గమ్యస్థానం ఎప్పుడు చేరుకుంటామో తెలియని పరిస్థితి.

పులుల అభయారణ్యం కావడంతో ప్రయాణంలో ఎక్కడా ఆగేందుకు అటవీశాఖ అధికారులు అంగీకరించరు. పోనీ రోడ్డు విస్తరణ చేద్దామా అంటే అందుకు అటవీ చట్టాలు అడ్డుగా మారా యి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మార్గాన్ని ఎలా అప్‌గ్రేడ్ చేయా లని భావించిన అధికారులు ముందు ఎలివేటెడ్ కారిడార్(సహజమైన నేల స్థాయికి ఎత్తులో నిర్మించబడిన రహదారి) నిర్మించాలని మొగ్గుచూపారు. ఈ మేరకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని అధికారులు తెలిపారు. 

అడుగడుగునా స్పీడ్ బ్రేకర్లే..

హైదరాబాద్ నుంచి కల్వకుర్తి మీదుగా శ్రీశైలం 225 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ మార్గంలో శ్రీశైలం ముఖద్వారం అయిన మన్ననూరు వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాగుతుంది. కానీ మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు సుమా రు 80కి.మీ. మార్గం మాత్రం పూర్తిగా ఘాట్ రోడ్డు కావడంతో పాటు రెండు లేన్ల రోడ్డు మాత్రమే కావడంతో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతాయి.

దీనికితోడు అడుగడుగునా స్పీడ్ బ్రేకర్లతో పాటు పులులు సంచరించే ప్రాంతం కాబట్టి వేగ నియంత్రణ కూడా ఉంటుంది. శక్తిపీఠమైన శ్రీశైలం దేవస్థానానికి దేశవ్యాప్తంగా భక్తులు భారీసంఖ్యలో వస్తుంటారు. కానీ రవాణా సదుపాయాల విషయంలో మాత్రం అధ్వా న పరిస్థితి. ఈ నేపథ్యంలో బ్రేక్ జర్నీ లేకుం డా అన్నివేళల్లో శ్రీశైలం వెళ్లడానికి జాతీయ రహదారిని విస్తరించాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.

ఈ ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఎలివేటెడ్ కారిడార్ ద్వారా ఎక్కడ కూడా కిందకు దిగేందుకు అవకాశం లేకుండా శ్రీశైలం వెళ్లేలా హైవేను ఫోర్ లేన్‌గా విస్తరించాలని ప్రణాళిక రచించారు. అయితే ఈ విధానం ద్వారా కొన్ని పరమితులు ఉన్నాయని భావిస్తూ సొరంగ మార్గం ద్వారా హైవేను విస్తరించాలనే మరో ఆలోచన చేశారు.

దీనిపైనా అధ్యయనం చేసేందుకు కసరత్తు కూడా జరిగింది. అయితే అసలే దట్టమైన అటవీప్రాంతం కావడంతో పాటు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం తర్వాత ఈ విధానంలో ఉన్న పరిమితులు, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎలివేటెడ్ కారిడార్ మాత్రమే సేఫ్ అని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. 

ఎలివేటెడ్ కారిడార్ ద్వారానే..

పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణమే మంచి పరిష్కారం అవుతుందని అధికారులు నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే అమ్రాబాద్ టైగర్ రిజర్వులో కొద్ది నెలల కిందట అధ్యయనం సైతం జరిగింది. దాదాపుగా 80 కి.మీ మేర ప్రస్తుతం ఉన్న రహదారి బదులుగా ఎలివేటెడ్ కారిడార్ ద్వారా హైవే నిర్మించడం వల్ల 17.5 కి.మీ దూరం తగ్గుతుంది.

30 అడుగుల ఎత్తుతో 62.5 కి.మీ. మేర ఎక్కడా మలుపులు లేకుండా ఎలివేటెడ్ కారిడార్ రహదారిని నిర్మించేందుకు అలైన్‌మెంట్ రూపొందించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వు కావడంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అటవీశాఖ పలు షరతులు విధించింది.

హైవే మధ్యలో ఫరాబాద్ గేటు వద్ద ఇరువైపులా ర్యాంపుల నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రతిపాదించగా అటవీశాఖ తిరస్కరించింది. ర్యాంపులుంటే వాటి మీదుగా పులులు ఎలివేటెడ్ కారిడార్‌పైకి వచ్చేస్తాయని అటవీశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఎలివేటెడ్ కారిడార్‌లో ఎక్కడా ర్యాంపులు ఉండవద్దని స్పష్టం చేసింది. ఎలివేటెడ్ కారిడార్ అంచనా వ్యయం రూ.7,000కోట్లు.

రికార్డు స్థాయిలో ఎలివేటెడ్ కారిడార్ 

ప్రస్తుతం థాయిలాండ్‌లో 55 కి.మీ. మేర అతిపెద్ద ఎలివేటెడ్ కారిడార్ ఉన్నా మధ్యలో భూమార్గంలోనూ ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక ముంబయిలో ఉన్న అటల్ సేతు (సౌత్ ముంబయి నుంచి నవీ ముంబయి వరకు) 21.8 కి.మీ పొడవుతో ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ఎలివేటెడ్ కారిడార్. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్డు ఎలివేటెడ్ కారిడార్ కానుంది.

ప్రస్తుతం హైదరాబాద్-శ్రీశైలం మధ్య 225 కి.మీ దూరం కాగా.. ఎలివేటెడ్ కారిడార్ ద్వారా అది 207 కి.మీ.లకు తగ్గనుంది. ఫలితంగా హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి కేవలం 3 గంటల్లో చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీనికి తోడు శ్రీశైలం నుంచి ఆత్మకూరు వైపు దోర్నాల వరకు కూడా ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని కేంద్రం భావిస్తోంది.

దీంతో ప్రస్తుతం హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా ఆత్మకూరు, నంద్యాల, తిరుపతి వెళ్లే ప్రయాణికులు ఈ నిర్మాణం పూర్తయితే శ్రీశైలం మీదుగా వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది. ఫలితంగా ఈ హైవేకు ఎక్కడ లేని డిమాండ్ వస్తుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు, తిరుపతి హైవేలకు ప్రత్యామ్నాయంగానూ మారుతుంది.