calender_icon.png 14 October, 2024 | 3:55 AM

ఏనుగు x పోచారం

14-10-2024 01:00:04 AM

బాన్సువాడను వదలి వెళ్లను

అధిష్టాన పెద్దలు నాకు చెప్పలేదు

నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డి

కామారెడ్డి, అక్టోబర్ 13 (విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గాన్ని తాను వీడే ప్రసక్తి లేదని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్  నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాలని తనకు చెప్పలేదన్నారు. అందరిని కలుపుకొని నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అయోమయానికి గురి చేసే చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు.

వారి మాటలను ఎవరు నమ్మవద్దని ఆయన అన్నారు. అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పనిచేసిన ప్రతి నాయకునికి, కార్యకర్తకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. పనిచేసిన వారికి పదువులు వరిస్తాయని తెలిపారు.

కొందరు పదవుల కోసం పార్టీలోకి వచ్చి ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన నాయకులను, కార్యకర్తలను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వారికి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో ఎలమంచిలి శ్రీనివాస్‌రావు, కమలాకర్‌రెడ్డి, మంత్రి గణేష్, కొత్తకొండ భాస్కర్, శ్రీనివాస్ సత్యం తదితరులు పాల్గొన్నారు.

స్వార్థ రాజకీయాలు వద్దు

పార్టీ పటిష్టతకే ప్రాధాన్యమివ్వాలి

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి

కామారెడ్డి, అక్టోబర్ 13 (విజయక్రాంతి): స్వార్థ రాజకీయాలను విడనా డాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం బాన్సువాడలో పలువురు నాయకులు, కార్యకర్త లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరిపైనా తప్పుడు విమర్శలు చేయలేదన్నారు.

ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ కోసం పనిచేసిన వారిని గుర్తించి కొటగిరి వర్ని మార్కెట్ కమిటీ పదవులను కట్టబెడుతున్నట్టు తెలిపారు. పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలి తప్ప స్వార్థ రాజకీయాల కోసం బలి పశువులను చేయవద్దన్నారు. తనపై పోటీ చేసిన కాసుల బాలరాజు తనను కించపరచలేదని, తానూ అతనిని కించపరచలేదన్నారు.

తనపై పోటీ చేసిన ఓ తమ్ముడు కలిసి పనిచేయడానికి రావాలిగానీ కొంతమంది ద్వారా ఆరోపణలు చేయించడం రాజకీయ నాయకుడి లక్షణం కాదన్నారు. ఒకే పార్టీలో ఉండి విమర్శించుకోవడం మంచి రాజకీయ వ్యక్తి లక్షణం కాదన్నారు. సమావేశంలో రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, గురు, వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.