కోటి రూపాయల ప్రభుత్వ ఆస్తి నష్టం...
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులోని రాజీవ్ పార్క్ పక్కన గల 32/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్(KV Electricity Sub Station) నిర్వాహకుల నిర్లక్ష్యము వల్ల ప్రమాదవశాత్తు మంటలు ఏర్పడి విద్యుత్ సబ్ స్టేషన్ మంగళవారం మధ్యాహ్నం దగ్ధమైంది. సబ్ స్టేషన్ నిర్వాహకులు పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. సబ్ స్టేషన్ నిర్వాహకులు ప్రతిరోజు సబ్ స్టేషన్ ను పర్యవేక్షించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
లైన్ ట్రిప్ కాలేదని విద్యుత్ తీగలు తెగి పడలేదని అయినప్పటికీ సబ్ స్టేషన్ కాలిపోవడం విద్యుత్తు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే జరిగి ఉంటుందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. విద్యుత్ ఎస్సీ శ్రావణ్ కుమార్(SC Shravan Kumar) వివరణ సబ్ స్టేషన్ లో ఆయిల్ ఎక్కువ ఉండటం వల్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని పిటిఆర్ వైండింగ్ కాలిపోయి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయని అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగిందన్నారు. సాంకేతిక కారణాల వలన ఈ సంఘటన జరిగిందని భావిస్తున్నామన్నారు. ఈ ఘటన వల్ల ప్రాణ నష్టం జరగలేదని సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేయడం జరిగిందన్నారు. సబ్ స్టేషన్ దగ్ధం వల్ల కోటి రూపాయల వరకు ప్రభుత్వ ఆస్తి నష్టం జరిగినట్లు భావిస్తున్నామన్నారు.