మిర్యాలగూడ, ఫిబ్రవరి 6 (విజయ క్రాంతి) : మిర్యాలగూడ పట్టణంలో అప్రకటిత విద్యుత్ కోతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేసవికి ముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్నరోజుల్లో ఏస్థాయిలో ఉంటాయోనని వినియోగ దారులు ఆందోళన చెందుతున్నారు. గంట కోసారి సరఫరాలో అంతరాయం ఏర్పడు తుండడంతో వ్యాపారులు, పెట్రోల్ బంకుల నిర్వాహకులు తీవ్ర అసౌకర్యానికి గురవు తున్నారు.
గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా పట్టణంలోని జైళ్లశాఖ పెట్రోల్ బంకులో వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. జైళ్లశాఖ బంకులో నాణ్యమైన పెట్రోలు, డీజిల్ లభిస్తుందని నిత్యం వాహనదారులు భారీగా వస్తుంటారు. తరచూ కరెంట్ సరఫరాలో అంతరాయం కారణంగా పంపులు సకాలంలో ఆన్కాకపోవడంతో వాహనదారులు గంటల కొద్ది నిరీక్షించాల్సి వస్తున్నది.