calender_icon.png 18 November, 2024 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్చికల్లా యాదాద్రిలో విద్యుత్ ఉత్పత్తి

05-08-2024 01:42:19 AM

  1. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి
  2. సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణానికి టెండర్లు పిలవండి
  3. ప్రజావాణిలో వచ్చే ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలి
  4. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, నాలెడ్జ్ సెంటర్ల నిర్మాణాలు ప్రారంభించాలి
  5. అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు

హైదరాబాద్, ఆగస్ట్ 4 (విజయక్రాంతి): వచ్చే ఏడాది మార్చి కల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాలని జెన్‌కో అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

ఆదివారం సచివాలయంలో జెన్‌కో ఉన్నతాధి కారులతో ప్లాంట్ పనులపై సమీక్ష నిర్వహించారు. మొదటి యూనిట్ అక్టోబర్ 30 కల్లా, రెండో యూనిట్ అక్టోబర్ 15 కల్లా, మూడో యూనిట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి, నాలుగో యూనిట్ ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి, 5వ యూనిట్ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్లాంట్‌లో పనిచేసే కొద్దిమంది అధికారులు, సిబ్బంది జ్వరాలతో బాధపడుతున్నారని, ఫలితంగా పనుల్లో కొంత జాప్యం జరుగుతున్నట్టు సమావేశంలో అధికారులు వివరించారు. సిబ్బంది సంక్షేమమే ముఖ్యమని, వెంటనే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, దోమ తెరలు అందించాలని అధికారులను భట్టి ఆదేశించారు. అధికారులు, కార్మికులు స్థానికంగా నివసించేందుకు వెంటనే క్వార్టర్ల నిర్మాణానికి టెం డర్లు పిలవాలన్నారు.

నిర్మాణం పూర్తయ్యేవరకు మిర్యాలగూడ, దామరచర్ల నుంచి సిబ్బందిని తరలించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. పవర్ ప్లాంట్ నుంచి బూడిద తరలింపునకు తాళ్ల వీరప్పగూడెం, దామరచర్లకు 4 వరుసల బైపాస్ రోడ్డు నిర్మాణం ప్రగతిపై వారంలోగా తనకు నివేదిక సమర్పించాలన్నారు. ఈ నెలలోనే తాను ప్లాంటును సందర్శించి, అధికారులు, సిబ్బందితో భేటీ అవుతానని చెప్పారు. 

మూడ్నెల్లకోసారి ప్రజావాణిపై సమీక్ష

ప్రజావాణి పనితీరుపై ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని భట్టి విక్రమార్క అన్నారు. ప్రజావాణిలో వచ్చే ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలన్నారు. ఆదివారం సచివాలయంలో ప్లానింగ్ కమిషన్ వైస్‌చైర్మన్ చిన్నారెడ్డితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.

ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వ విధానాల్లో ఏవైనా మార్పులు చేయాలని ప్రజావాణి అధికారులు భావిస్తే వాటిని రాతపూర్వకంగా ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు. ఇందులో సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదులు, అవి పరిష్కరిస్తున్న తీరును డిప్యూటీ సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

నిర్మాణాలు ప్రారంభించాలి

రాష్ట్రంలో ఇప్పటికే స్థలం అందుబాటులోకి వచ్చిన 20 ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్సుల నిర్మాణం ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను భట్టి విక్రమార్క ఆదేశించారు. వీటి నిర్మాణం వచ్చే ఏడాది కల్లా పూర్తి కావాలని స్పష్టం చేశారు. పాఠశాలల లేఅవుట్, డిజైన్లు, వసతులు, బడ్జెట్ అంశాలపై చర్చించారు.

వీటితో పాటు అంబేడ్కర్ నాలెడ్జ్ కోచింగ్ సెంటర్ల నిర్మాణ పనులను త్వరిగతిన ప్రారంభించాలని నిర్దేశించారు. ఈ భవనాలకు అవసరమైన స్థలం, నిర్మాణ వ్యయంపైన సమీక్షించారు. వీటిని ప్రతి నియోజకవర్గంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేదా పాలిటెక్నిక్ కళాశాలల ఆవరణలో నిర్మించాలని సూచించారు. అందువల్ల కళాశాల విద్యార్థులు సైతం వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.  

త్వరలో కొత్త పింఛన్లు

కొత్త రేషన్‌కార్డులు, పెన్షన్లు, ధరణికి సంబంధించిన ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్టు నోడల్ అధికారి దివ్య దేవరాజన్ సమావేశంలో వివరించగా.. రేషన్ కార్డులకు సంబం ధించి ప్రభుత్వం సబ్‌కమిటీ ఏర్పాటు చేసిందని, త్వరలోనే నిర్ణయం తీసుకొని కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. రేషన్‌కు, సంక్షేమ పథకాలకు వేర్వేరు గుర్తింపు కార్డుల జారీ అంశంపై చర్చ జరుగుతుందని, త్వరలోనే నిర్ణయిస్తామన్నారు.

కొత్త పింఛన్లను సైతం త్వరలో మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తే ప్రయోజనం లేదు వారికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని, అందుకు అవసరమైతే ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ డెస్క్‌లను బలోపేతం చేసేలా చర్యలు చేపడితే సీఎంఆర్‌ఎఫ్‌కు సంబంధించి ఫిర్యాదులు తగ్గిపోతాయన్నారు.