- ప్రజలకు తెలియకుండా చాటుమాటున పదేండ్లు వడ్డింపు
- బీఆర్‌ఎస్ విమర్శలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎదురుదాడి
- గత పాలనలో 20 వేల కోట్ల భారం మోపారని ప్రతివిమర్శ
- చార్జీలు పెంచకుండా 50 లక్షల ఇండ్లకు గృహజ్యోతి అమలు
హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాం తి): విద్యుత్ చార్జీలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు వస్తున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ మరిన్ని గణాంకాలతో ఎదురుదాడికి దిగింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్లలో విద్యుత్ చార్జీల పెంపుదలతో ప్రజలపై సుమారు రూ.20 వేల కోట్ల భారాన్ని మోపినట్టుగా గణాంకాలను చూపెడుతోంది.
2015 2016 2022 ఆర్థిక సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం ప్రజలకు తెలియకుండానే చార్జీలను పెంచిందని, ఆ భారంతోనే రెండు డిస్కంలకు వచ్చే ఆదాయం పెరిగిందని కూడా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
వినియోగదారులపై 20 వేల కోట్ల భారం 2015 లో గృహ, గృహేతర, పరిశ్రమలతోపాటు అన్ని క్యాటగిరీల్లో ఉండే వినియోగదారులకు విద్యుత్తు సరఫరా చేయడం ద్వారా రాష్ట్రంలోని రెండు డిస్కంలు (ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్) పొందిన ఆదాయం రూ. 18,845 కోట్లుగా ప్రభుత్వం చెప్తోంది.
అదే 2023 ఆర్థిక సంవత్సరంలో గత ప్రభు త్వం దిగిపోయేంత వరకు.. అన్ని వర్గాల వినియోగదారుల నుంచి రెండు డిస్కంలకు వచ్చిన ఆదాయం రూ.43,439 కోట్లు. ఈ రెండింటి మధ్య తేడా రూ.24,594 కోట్లు.
ఇందులో కొత్త వినియోగదారులు, వినియోగం పెరగడం వల్ల వచ్చే ఆదాయాన్ని పక్కనపెడితే.. దాదాపు రూ.20 వేల కోట్లు కేవలం చార్జీలను పెంచడం ద్వారానే వచ్చిందని.. అ లెక్కన ఈ మొత్తం ప్రజలపై అదనం గా మోపిన భారమని కొత్త ప్రభుత్వం ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతోంది.
చాటుమాటున వడ్డింపులు
2014లో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 2024 వరకు చూస్తే మొత్తం మూడుసార్లు బీఆర్‌ఎస్ పాలనలోనే విద్యుత్ చార్జీలు పెరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం గణాంకాలు సహా వెల్లడించింది. 2015 లో అప్పటి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను 5 శాతం మేర పెంచిందని, 20౧6 24 గంటల కరెంటు పేరు చెప్పి మరో 8 శాతం వరకు చార్జీలను పెంచిందని దుమ్మెత్తిపోస్తోంది.
అదీగాక 2022 గంపగుత్తగా ఒకేసారి 16 శాతం ఛార్జీలను పెంచిన ఘనత గత ప్రభుత్వానిదేనంటూ విమర్శలకు దిగుతోంది. దీనివల్ల వినియోగదారులపై ఏకంగా రూ.6 వేల కోట్ల అదనపు భారం పడిందని లెక్కలతో బయటపెడుతోంది.
అయితే అయిదేండ్ల పాటు ఛార్జీలు పెంచలేదంటూ ప్రజలను అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నమ్మించే ప్రయత్నం చేసిందని, చాటుమాటున చార్జీలు వడ్డించి ప్రజలను మోసం చేసిందంటూ విమర్శిస్తున్నారు. ఏ ఒక్క వర్గాన్ని కూడా వదలకుండా యూనిట్‌పై 50 పైసల నుంచి రూపాయి వరకు పెంచిందని..
వీటితోపాటు ఫిక్స్‌డ్ చార్జీలను కూడా పెంచేసిందని ధ్వజమెత్తుతున్నారు. దీనితోపాటు విద్యుత్తు సంస్థల ఆదాయం, ఖర్చు, లాభనష్టాలను బయటపెట్టకుండా గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని భ్రష్టుపట్టించిందని మండిపడుతున్నారు. అందుకే తెలంగాణలోని డిస్కంలు రూ.వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయని తాజా ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఏఆర్‌ఆర్ దాఖలు ఏదీ?
వాస్తవానికి యేటా డిస్కంలు వచ్చే ఏడాదికి సంబంధించి ఏఆర్‌ఆర్ (వార్షిక ఆదాయ అవసరాలు) ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించాల్సి ఉంటుంది. కానీ, గత పదేండ్ల చరిత్ర చూసుకుంటే.. 2014-15, 2019-20, 2020-21, 2021-22లకు ఏఆర్‌ఆర్ ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్సీకి దాఖలు చేయ కపోవడం కేవలం అప్పటి ప్రభుత్వ వైఫల్యంగానే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది.
ఇదంతా దాచిపెట్టి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, రూ.18 వేల కోట్ల చార్జీల భారం పెంచుతుందని ప్రతిపక్ష నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నట్టుగా తిప్పికొడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచలేదని, డిస్కంలు ప్రతిపాదించిన రూ.1,200 కోట్ల చార్జీల పెంపు భారాన్ని కూడా వినియోగదారులపై మోపకుండా, ప్రభుత్వమే సబ్సిడీ రూ పంలో భరించేందుకు సిద్ధపడిందని చెప్తున్నారు.
చార్జీలను పెంచకుండా గృహజ్యోతి పథకాన్ని దాదాపు 50 లక్షల గృహాలకు అమలుచేస్తూ, 200 యూని ట్ల వరకు పూర్తి ఉచిత విద్యుత్తును అందిస్తున్నట్టు స్పష్టంచేస్తున్నారు.