calender_icon.png 27 October, 2024 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంటు బిల్లు @ రూ.1,47,222

27-10-2024 12:10:09 AM

  1. 8 ఏండ్ల బిల్లు ఒక్కసారే వడ్డన 
  2. బాధితుడు ఫిర్యాదు చేసేంత వరకూ సోయేలేని అధికారులు 
  3. లబోదిబోమంటున్న బాధితుడు 

మంచిర్యాల, అక్టోబర్ 26 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కొమ్మెరలో ఓ వినియోగదారుడికి ట్రాన్స్‌కో అధికారులు రూ.1,47,222 బిల్లుతో షాక్ ఇచ్చారు. గ్రామానికి చెందిన గట్టు సంపత్‌గౌడ్ ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇల్లు నిర్మాణం 2016లో పూర్తి చేసుకున్నాడు. ఇంటికి కరెంటు మీటరు కోసం దరఖాస్తు చేసుకోగా విద్యుత్ అధికారులు మీటర్ బిగించారు.

కాగా, సర్వీస్ నంబర్, వినియోగదారుడి పేరు, వివరాలు ఆన్‌లైన్ చేయడం మరిచా రు. 8 ఏండ్ల తరువాత బిల్లు రూ.2.60 లక్షలు దాటిందని, కొన్ని వెసులుబాటు పోను రూ.1,47,222 కట్టాల్సిందేనని చెప్పడంతో సంపత్ అవాక్కయ్యాడు. కాగా,  మీటర్ తీసుకున్న నాటి నుంచి బిల్లు రాకపోవడంతో సంపత్ పలుమార్లు లైన్‌మెన్‌ను, ఏఈలను కలిసి సమస్య వివరించాడు.

వారు పట్టించుకోకపోవడంతో ఈ ఏడాది మేలో విజిలెన్సు అధికారులను సంప్రదిం చాడు. తనే వెళ్లి సమస్య తెలిపేంత వరకు సోయిలేని అధికారులు.. తనకు పంపిన  బిల్లును చూసి కంగుతిన్నాడు. కాగా, తనకు న్యాయం కోసం చెన్నూర్‌లోని విద్యుత్ శాఖ ఏడీఈ కార్యాలయం వద్ద శనివారం బాధితుడు ధర్నాకు దిగాడు.

ఎలా లెక్క వేసినా బిల్లు రూ.50 వేలు దాటవని, నెలనెలా బిల్లు ఇస్తే కట్టేవాడినని, అధికారుల నిర్లక్ష్యం తనకు శాపంగా మారిందని బాధను వెల్లగక్కాడు.