calender_icon.png 1 April, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రోకర్ల అవతారంలో విద్యుత్ కాంట్రాక్టర్లు!

29-03-2025 12:04:56 AM

ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్

డీడీలు కట్టినా ట్రాన్స్‌ఫార్మర్ల కోసం తప్పని ఎదురుచూపు

సంఘాల నేతలే శాసించే స్థాయికి

తీవ్రంగా నష్టపోతున్న రైతాంగం

 నాగర్ కర్నూల్ మార్చి 28 విజయక్రాంతి భూతల్లిని నమ్ముకొని సాగు చేస్తున్న రైతాంగానికి విద్యుత్ అధికారులు కాంట్రాక్టర్ల రూపంలో కష్టాలు తప్పడం లేదు. బోరు మోటర్లకు విద్యుత్ కనెక్షన్ కోసం డీడీలు చెల్లించి ఏళ్లు గడుస్తున్నా ఎదురుచూపులు మాత్రం తప్పడం లేదు. డీడీలు కట్టిన 90 రోజుల్లోనే ట్రాన్స్ఫార్మర్ స్తంభాలు ఇతర సామాగ్రి సరఫరా చేస్తూ సంబంధిత కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ డీడీలు కట్టి ఏళ్లు గడుస్తున్నా ఆ రైతాంగానికి విద్యుత్ కనెక్షన్ మాత్రం అందించడం లేదు. ఫలితంగా వర్షాధార పంటల పైనే ఆధార పడాల్సి వస్తుంది. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవాల్సింది పోయి కాంట్రాక్టర్లు ఇచ్చే ముడుపులకు ఆశపడి రైతాంగం ఆవేదనను పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు.

ఇతర ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా వేసే వెంచర్ల వారికి గంటల వ్యవదిలోనే ట్రాన్స్ఫార్మర్లు రావడం ఫిట్టింగ్ వంటి పనులు శర వేగంగా జరిగిపోతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 2023 నుంచి సుమా రు 8000 మంది రైతులు ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్నారని వాటిలో కనీసం 50% కూడా ట్రాన్స్ఫార్మర్లు బిగించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం విద్యుత్ వినియోగదారుల ఫోరం ఏర్పాటు చేయగా రైతుల నుండి వినతులు వెల్లువలా వచ్చాయి. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభ సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో లైన్ ఇన్స్పెక్టర్లు ఆయా ప్రాంతాల్లో భూమికి చేరువలో ఉండే విద్యుత్ లైన్లను ఒరిగి ఉన్న స్తంభాలను సరి చేయాల్సి ఉంది.

కానీ ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదని రైతులు మండిపడుతున్నారు. నేరుగా అధిక మొత్తం లో డబ్బులు వసూలు చేసి చాలాకాలం తర్వాత ట్రాన్స్ఫార్మర్ ఫిటింగ్ చేస్తున్నారని నిబంధనలకు లోబడి డీడీలు చెల్లిస్తే మాత్రం కొర్రీలు పెట్టి రైతులను కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిప్పుతున్నారని మండిపడుతున్నారు. విద్యుత్ అధికారులపై ఫిర్యాదులు చేసినా సంఘాల నేతలే అధికారులను శాసించడంతో చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుకు గురయ్యే క్రమంలోనూ రైతుల నుండే డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎల్టి లైన్ ఆన్ ఆఫ్ స్విచ్ వంటి సామాగ్రిని సక్రమంగా పంపిణీ చేయడం లేదని ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులను గురవుతున్నారని మండిపడుతున్నారు. సామాగ్రిని రైతుల పంట పొలాలకు చేర్చే వాహనాలు కూడా తక్కువ ఉండడంతో ఆలస్యం జరుగుతోందని రైతులు పేర్కొంటున్నారు. 

 ఎల్టి లైన్ ఇవ్వడం లేదు...!

 2021 సంవత్సరంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం మూడు డీడీలు చెల్లించగా 2022 ఏడాదిలో ట్రాన్స్ఫార్మర్ ఫిట్టింగ్ చేశారు. అందుకు ఐదు విద్యుత్ స్తంభాలను నాటారు. కానీ ఎల్టి లైన్ ఇవ్వకుండా తాత్సా రం చేస్తున్నారు. ఫలితంగా నాలుగేళ్లుగా విద్యుత్ కనెక్షన్ కోసం ఎదురు చూస్తున్నాం. పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లిన శరా మామూలుగా వదిలేశారు. 

 -రైతు యాదగిరి, సల్కరిపేట,  బిజినపల్లి మండలం. 

 ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అంటున్నారు...!

గ తేడాది ఏప్రిల్ 15న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం కావలి లక్ష్మమ్మ రెండు,  అబ్బ మాసమ్మ ఒక డిడి చొప్పున మూడు డిడిలకు 17,400 రూపాయలతో డిడి చెల్లిం చాం కానీ ఇప్పుడు అప్పుడు అంటూ ట్రాన్స్ఫార్మర్ బిగింపు కోసం కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు. వినియోగదారుల ఫోరం ముందు గోడు వెల్లబోసుకుంటున్న క్రమంలో మీ పొలంలో బిగింపు జరుగుతోందని అబద్ధాలు చెప్పారు. 

-మధు, నంది వడ్డేమాన్, బిజినపల్లి మండలం. 

 ట్రాన్స్ఫార్మర్ వచ్చేది కష్టమే అంటున్నారు..!

 2013 మార్చి 20న బోరు మోటర్ ట్రాన్స్ఫార్మర్ కోసం పద్మమ్మ పేరుతో 5,650 డిడి చెల్లించా కానీ ఇప్పటివరకు ఎవరు పట్టించుకోవడం లేదు. నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగిన స్పందించలేదు. చివరికి నీకు ట్రాన్స్ఫార్మర్ రావడం కష్టమే అని అంటున్నారు. 

- వెంకటయ్య, ఖానాపూర్, బిజినపల్లి మండలం