రంగారెడ్డి, నవంబర్ 6 (విజయక్రాంతి): విద్యుత్ తీగల చోరీలకు పాల్పడుతున్న ముఠాను రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం షాద్‌నగర్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ రంగస్వామి వివరాలు వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లా పాల్మాకులకు చెందిన కట్టా శ్రీనివాస్, పెద్దతుప్పకు చెందిన అతని బంధువు కాకునూరి శ్రీకాంత్, మహేశ్వరం మండలం నల్లచెరువు తండాకు చెందిన ఆటో డ్రైవర్ బానోత్ రాజు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికుడు దిలావర్ ఓ ముఠాగా ఏర్పడి వెంచర్లలో ఉన్న విద్యుత్ తీగలతో పాటు ఇనుప సామగ్రిని దొంగిలించి, వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
షాద్‌నగర్, తలకొండపల్లి, కడ్తాల్, నందిగా మ, శంషాబాద్, జడ్చర్ల టౌన్, మహేశ్వరం, కందుకూరు, మంచాల ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. షాద్‌నగర్ పోలీసులు ఈ నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ విషయం వెలుగు చూసింది. వీరి నుంచి రూ.12.50 లక్షల నగదు, రెండు మినీ ట్రక్కులు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ నలుగురిపై పలు ప్రాంతాల్లో 17 కేసులు నమోదైనట్లు ఏసీపీ తెలిపారు.