calender_icon.png 22 October, 2024 | 6:13 AM

మెరుగైన కరెంట్ సేవలకు విద్యుత్ అంబులెన్స్‌లు

22-10-2024 02:04:03 AM

  1. టీజీఏఐఎంఐఎస్ యాప్‌తో అత్యవసర ప్రదేశం గుర్తింపు
  2. అంతరాయాన్ని వెంటనే పునరుద్ధరించేందుకు చర్యలు
  3. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 21(విజయక్రాంతి): దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు మెరుగైన విద్యుత్ అందించేందుకు ప్రత్యేక వాహనాల(విద్యుత్ అంబులెన్స్‌లు)ను తీసుకొచ్చామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ అంతరాయాన్ని వెంటనే పునరుద్ధరించేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా తీసుకొచ్చిన వాహనాలను సోమవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్‌లో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేందుకు సెంట్రల్ బ్రేక్ డౌన్(సీబీడీ) విభాగాన్ని పటిష్ట పరిచేందుకు అన్ని డివిజన్‌లలో అంబులెన్స్ తరహాలో ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ ప్రత్యేక వాహనలు 24గంటలూ అందుబాటులో ఉంటాయని చెప్పారు.

అంతరాయం కలిగినపుడు వినియోగదారులు 1912టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే వెంటనే అత్యవసర సిబ్బంది అందుబాటులోకి వస్తారని పేర్కొన్నారు. ప్రతి వాహనంలో ఒక ఏఈ, ముగ్గురు లైన్ సిబ్బంది, అవసరమైన మెటీరియల్‌తో పాటు భద్రతా పరికరాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

ఈ వాహనాలకు ట్రాన్స్‌ఫార్మర్లను లాగగలిగే సామర్థ్యం ఉంటుందని, దీంతో తక్కువ సమయంలో తరలించడం, మార్చే అవకాశం ఉంటుందని చెప్పారు. టీజీఏఐఎం ఐఎస్ యాప్ అత్యవసర ప్రదేశాన్ని గుర్తించేందుకు ఉపయోగప డుతుందని పేర్కొన్నారు.

వీటిని విద్యుత్ అంబులెన్స్‌లుగా పిలువొచ్చని, ఈ వాహనాలు దిగ్విజయంగా సేవలందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇంధనశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్, సుల్తానియా, సీఎండీలు ముషారఫ్ అలీ, వరుణ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.