calender_icon.png 8 September, 2024 | 8:44 AM

ఆగస్టు మొదట్లో ఎన్నికల జాబితా

27-07-2024 03:49:48 AM

  1. స్థానిక ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి 
  2. గడవులోగా రిజర్వేషన్లపై బీసీ కమిషన్ నివేదికివ్వాలి 
  3. పంచాయతీరాజ్ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశం

హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ర్ట సచివాలయంలో ఆయన అధ్యక్షతన పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై శుక్రవారం సాయంత్రం సమీక్ష సమావేశం జరిగిం ది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడానికి ఉన్న ఆటంకాలు ఏమిటని సీఎం అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నుంచి రాష్ర్ట ఎన్నికల సంఘానికి (ఎస్‌ఈసీ) నూతన ఓటర్ల జాబితా రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.

అందుకు ఎంత సమయం పడుతుందని సీఎం ప్రశ్నించారు. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు ఈసీఐ జాబితా పంపిందని, తెలంగాణతోపాటు మరో ఆరు రాష్ట్రాలకు వారం రోజుల్లో జాబితాలు పంపిస్తుందని అధికారులు సమాధానమిచ్చారు. జాబితా రాగానే వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. వారంలోపే ఆయా స్థానిక సంస్థలకు తగినట్లు ఓట్లర్ల జాబితాలు రూపొందించాలని సూచించారు.  దీంతో ఆగస్టు మొదటి వారంలో జాబితా ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. రిజర్వేషన్లకు సంబంధించి బీసీ కమిషన్ సైతం నిర్దిష్ట గడువులోగా నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు.

రిజర్వేషన్లపై బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం ప్రధాన కార్యదర్శి వీ శేషాద్రి, కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, వేముల శ్రీనివాసులు, సంగీత సత్యానారాయణ, అజిత్‌రెడ్డి, అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.