calender_icon.png 24 October, 2024 | 10:04 PM

29ఏళ్లుగా పాల్వంచలో ఎన్నికల్లేవ్

09-07-2024 03:25:44 AM

  • ప్రత్యేక అధికారి పాలనలోనే మున్సిపాలిటీ 
  • కోర్టులో ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ వివాదం! 
  • ఎక్కడి సమస్యలు అక్కడే 
  • అభివృద్ధికి నోచుకోని పాల్వంచ పట్టణం 
  • రాజకీయ పార్టీలకు ప్రచార అస్త్రంగా ఎన్నికలు

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 8(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గల పాల్వంచ ద్వితీయశ్రేణి మున్సిపాల్టీలో 29 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించడం లేదు. ప్రత్యేక అధికారి పాలనలోనే కొనసాగుతోంది. ఫలి తంగా పట్టణం అభివృద్ధికి నోచుకోక, ఎక్కడి సమస్యలు అక్కడే అన్న చందాన ఉంది. ఎన్నికల సమయంలోనే పాల్వంచ మున్సిపాలిటీ ఎన్నికల అంశం నేతలకు గుర్తుకు వస్తుంది. ఎన్నికల ప్రచార అస్త్రంగా వాడుకొ ని ఆ తర్వాత వదిలేయడం పరిపాటిగా వస్తున్నది. ప్రత్యేక రాష్ట్రంలోనైనా ఎన్నికలు జరు గుతాయని స్థానికులు భావించినా నిరాశే మిగిలింది. 

మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మేజర్ పంచాయతీగా ఉన్న పాల్వంచ 1987లో మున్సి పాలిటీగా మారింది. ప్రస్తుతం 24 వార్డులు, సుమారు 1.25 లక్షల పైచిలుకు జనాభా,  సుమారు 60వేల మంది ఓటర్లున్నారు. పారిశ్రామిక, విద్యాసంస్థల కేంద్రంగా విరాజిల్లుతోంది. కానీ అభివృద్ధి మాత్రం జరగడం లేదు. మున్సిపాలిటీగా మారిన 1987లోనే తొలిసారిగా ఎన్నికలు నిర్వహించారు. 1992 వరకు పాలకవర్గం పనిచేసింది. చైర్మన్‌గా కాంగ్రెస్ నాయకులు కొమరం రాములు, వైస్ చైర్మన్‌గా వనమా వెంకటేశ్వరరావు కొనసాగారు. ఆ తర్వాత 1995లో మరోమారు ఎన్నికలు జరిగాయి.

తిరిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బన్సీలాల్ చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా తెలుగుదేశం నాయకుడు కిలారు నాగేశ్వరరావు బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు. ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ వివాదంతో ఎన్నికల వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉన్నదని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నారు. కానీ అందులో నిజమెంతా అని తెలియాల్సి ఉంది. ఆ అంశంపై ఎవరు కోర్టును ఆశ్రయించారు, దానికి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందా, కోర్టు వాయిదాలకు ఎవరు హాజరవుతున్నారనే ప్రశ్నలకు సమాధానం లేదు. 

ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎదగొద్దనే

రాజకీయ నాయకులు తమ స్వార్థంతోనే పాల్వంచకు ఎన్నికలు జరగకుండా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు నిర్వహిస్తే దానిపై చైర్మన్ అజమాయిషీ ఉంటుంది. చైర్మన్ లేకుంటే ఎమ్మేల్యేనే పెత్తనం చేయవచ్చు. దీనికి తోడు చైర్మన్ అయిన వ్యక్తి ఎమ్మెల్యే రేసులోకి వస్తాడు. ఈ కారణంగానే మున్సిపల్ ఎన్నికల అంశాన్ని గాలికి వదిలేసినట్లు తెలుస్తోంది. 

ప్రత్యేక అధికారులతో తీరని సమస్యలు

మున్సిపాలిటీకి పాలకవర్గం ఉంటే ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలపై కౌన్సిలర్లు దృష్టి సారించే వీలుంటుంది. ప్రత్యేక అధికారులుగా రెవెన్యూ అధికారులను నియమించడంతో వారు తమ శాఖాపరమైన పనులతోనే సతమతమవుతున్నారు. మున్సిపాలిటీ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ చూపలేకపోతున్నారు. పర్యవేక్షణలేమీతో పట్టణం అభివృద్ధి చెందడం లేదు. ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కనీసం పట్టణంలో డంపింగ్ యార్డు కూడా లేదంటే ఎంత పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

కాంగ్రెస్‌తోనైనా కల నెరవేరేనా?

కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌తోనైనా పాల్వంచ మున్సిపాలిటీలో ఎన్నికల కల నెరవేరుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు ముఖ్యమైన మంత్రులు ఉన్నారు. వారిపైనే పాల్వంచ ప్రజలు నమ్మకం పెట్టుకుని, ఎన్నికలు నిర్వహించేలా చూడాలని కోరుతున్నారు.