calender_icon.png 2 February, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల రాష్ట్రాలకే వరాలు

02-02-2025 02:00:27 AM

  1. దేశమంటే కొన్ని రాష్ట్రాలు మాత్రమే కాదు
  2. నిధులు రాబట్టడంలో రేవంత్ సర్కార్ వైఫల్యం
  3. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, ఫిబ్రవరి 1(విజయక్రాంతి): ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి, ఎన్నికలు లేని రాష్ట్రాలపై వివక్ష  చూపడం సరికాదని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. దేశమంటే మట్టి కాదోయో దేశమంటే మనుషులోయ్ అంటూ ప్రసంగించిన నిర్మల సీతారామన్ దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు బడ్జెట్ ప్రవేశ పెట్టడం బాధాకరమన్నారు.

కేంద్రమంత్రి  నిర్మల సీతారామన్ మాటలు బడ్జెట్‌కు విరుద్ధంగా  ఉన్నాయని, యావత్ దేశానికి సరిపోయే బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.  2024 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, 2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల బడ్జెట్ అని, 2026 యూపీ, 2027 గుజరాత్ కోసం బడ్జెట్ ప్రవేశ పెడతారా అని ప్రశ్నించారు.

బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా... తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విలువ లేదా అని నిలదీశారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏం సాధించినట్లు అని ఆయన ప్రశ్నించారు.

కేంద్ర జీడీపీకి 5.1శాతం కాంట్రిబ్యూట్ చేస్తున్న తెలంగాణ మరోసారి మోసపో యిందని, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ట్రైబల్ యూనివర్సిటీకి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. 

నిధులు రాబట్టుకోవడంలో రేవంత్ సర్కారు వైఫల్యం...

తెలంగాణకు నిధులు రాబట్టుకోవడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫల మైందని ఆరోపించారు. బడ్జెట్ కు పది రోజుల ముందు 40వేల కోట్లు కావాలని తూతూ మంత్రంగా లేఖ రాయడం తప్ప రాష్ర్ట ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభు త్వం చేసిందేం లేదని, కేంద్రం బడ్జెట్ ద్వారా నిధులు రాబట్టుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ర్ట కాంగ్రెస్ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఏడాది కాలం లో 30 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లారు..ఏం సాధించారో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు.