calender_icon.png 20 November, 2024 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పీకర్ పదవికి ఎన్నిక

26-06-2024 12:05:00 AM

దాదాపు 50 ఏళ్ల తర్వాత లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది.  సాధారణంగా స్పీకర్‌ను అధికార, ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయితీ. అయితే, ఈసారి అలా జరగడం లేదు. గత లోక్‌సభలో స్పీకర్‌గా పని చేసిన ఓం బిర్లానే మరోసారి స్పీకర్ పదవికి ఎంపిక చేసిన అధికార ఎన్డీఏ ఈ పదవిని ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలన్న ఇండియా కూటమి డిమాండ్‌కు ఎన్డీఏ అంగీకరించక పోవడమే ఈ ప్రతిష్టంభనకు కారణం. దీంతో లోక్‌సభ స్పీకర్ పదవికి ఇప్పుడు ఎన్నిక అనివార్యమయింది. అధికార ఎన్డీఏ అభ్యర్థిగా ఓం బిర్లా నామినేషన్ వేయగా, ఇండియా కూటమినుంచి ఎనిమిది సార్లు గెలిచిన కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ కె సురేశ్ బరిలో నిలిచారు.

బుధవారం స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. అధికార కూటమికి ఉన్న సంఖ్యా బలాన్నిబట్టి బిర్లా స్పీకర్‌గా ఎన్నిక కావడం ఖాయంగా కనిపిస్తున్నప్పటికీ అధికార పక్షంపై దాడికి విపక్ష కూటమికి ఇది ఆయుధంగా మారింది. వాస్తవానికి స్పీకర్ పదవి అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలు చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. మోడీ రెండుసార్లు ప్రధానిగా కొనసాగిన గత పదేళ్ల కాలంలో గడచిన లోక్‌సభ ఉప సభాపతి పదవి లేకుండానే గడిచింది. అయితే, అంతకు ముందు బీజేపీ మిత్రపక్షంగా ఉండిన అన్నాడిఎంకెకు చెందిన తంబిదురై డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. గడచిన లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు సంఖ్యాబలం చాలినంతగా లేకపోవడం, మిగతా ప్రతిపక్షాలు కూడా ఎవరికి వారుగా ఉండడంతో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగానే ఉండిపోయింది.

ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమిగా లోక్‌సభలో తమ బలాన్ని గణనీయంగా పెంచుకున్న ప్రతిపక్షాలు ఉపసభాపతి పదవికోసం పట్టుబట్టాయి. స్పీకర్ పదవిని అధికార పక్షం తీసుకుంటే డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని పట్టుబట్టాయి. లేదంటే స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని నిలబెడతామని హెచ్చరించాయి. ఇదే విషయాన్ని ఇండియా కూటమి నేతలతో చర్చలు జరపడానికి వచ్చిన రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు తెలియజేశాయి. స్పీకర్ పదవి ఏకగ్రీవమయ్యే సంప్రదాయాన్ని కొనసాగిద్దామని, అందుకు సహకరించాలని రాజ్‌నాథ్ ఖర్గే ప్రభృతులను కోరారు. అందుకు వారు అంగీకరించినా డిప్యూటీ స్పీకర్ పదవిపై హామీ కోసం పట్టుబట్టారు. దీనికి ఎన్డీఏ సర్కార్ అంగీకరించలేదు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక వచ్చినప్పుడు ఆ విషయంపై చర్చిద్దామని మాత్రమే తెలిపారు. దీంతో నామినేషన్ దాఖలకు కొద్ది నిమిషాల ముందు ఎన్డీఏ, ఇండియా కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 

స్వతంత్ర భారతదేశ చరిత్రలో లోక్‌సభ స్పీకర్ పదవికి ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే ఎన్నిక జరిగింది. 1956లో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభ, రాజ్యసభ ఏర్పడ్డాయి. అదే సంవత్సరం లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో శంకర్ శాంతారామ్‌పై మౌలాంకర్ విజయం సాధించారు. ఇక 1976లో ఎమర్జెన్సీ సమయంలో స్పీకర్ పదవికి బలిరాం భగత్, జగన్నాథ రావు పోటీ పడగా భగత్ 344 ఓట్లతో విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి లోక్‌సభ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. ఎంఎ అయ్యంగార్, జీఎస్ ధిల్లాన్, బలరాం జాఖడ్, జీఎంసీ బాలయోగిలు వరసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. ఇక స్వాతంత్య్రానికి పూర్వం 1925 ఆగస్టు 24న అప్పటి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నిక నిర్వహించారు. ఆ ఎన్నికల్లో టి.రంగాచారియర్‌పై స్వతంత్ర పార్టీ అభ్యర్థి విఠల్ భాయ్ జే పటేల్ కేవలం రెండు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత 1946 వరకు ఆరుసార్లు సభాపతి ఎన్నికలు జరిగాయి. చివరగా ఎన్నికయిన మౌలాంకర్ ఆ తర్వాత తాత్కాలిక పార్లమెంటుకు కూడా కొంతకాలం స్పీకర్‌గా కొనసాగారు.