రియల్ బ్రాండ్‌కు ఎన్నికల ఎఫెక్ట్
నాలుగు నెలలుగా స్తంభించిన స్థిరాస్తి రంగం
వరుసగా అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలు ఉండటమే కారణం
త్వరలోనే గాడిలో పడుతుందనే ఆశాభావం
హైదరాబాద్ సిటీబ్యూరో, ప్రధాన ప్రతినిధి, మే 11 (విజయక్రాంతి): వరుస ఎన్నికలతో రాష్ట్రంలో రియల్ రంగం స్తంభించింది. 2023 అక్టోబర్ నుంచి 2024 మే రెండవ వారం వరకు కూడా రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం నెలకొనడంతో స్థిరాస్తి రంగంలో ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రాలేదు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఆ తర్వాత రెండు నెలలకే ఎంపీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. రియల్ బ్రాండ్‌గా ఉన్న హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో ఒడిదొడుకులు నెలకొన్నాయి. గతంలో చేపట్టిన ప్రాజెక్టులలో ప్లాట్లు పూర్తి స్థాయిలో సేల్ కాకపోవడంతో పాటు రేట్లు తగ్గాయనే ప్రచారంతో రియల్టర్లు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు వారు ఆసక్తి చూపడం లేదు. జూన్ మొదటి వారంలో ఎన్నికల ఫలితాలు రానున్నాయి.
దేశంలో ఏ పార్టీ ప్రభుత్నాన్ని ఏర్పాటు చేస్తుందో తెలుస్తుంది. అయితే గత నాలుగున్నర నెలలుగా సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలపై పెట్టినంత దృష్టి పరిపాలనపై పెట్టలేదన్నది వాస్తవం. ఎన్నికలు పూర్తయిన తర్వాత జూన్ నుంచి పరిపాలనపై రేవంత్‌రెడ్డి పూర్తిస్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ ప్రధాన వనరుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి పూర్వవైభవం తీసుకువచ్చే అంశంపైనా సీఎం ప్రత్యేక దృష్టి సారిస్తారనే చర్చ రియల్టీ వర్గాలలో కొనసాగుతుంది.
జూన్, జూలైలోను కష్టమే...
జూన్, జూలైలో రియల్ రంగం పుంజుకుంటుందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో జూన్ తర్వాత కొత్తగా ప్రాజెక్టులు షురూ చేస్తారని, అనుమతుల జారీలోనూ జాప్యం ఉండదని హెచ్‌ఎండీఏ, రెరా వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ సాధారణంగా ప్రతి వార్షిక సంవత్సరంలో జూన్ రెండవ వారంలో స్కూల్స్, కాలేజ్‌లతో పాటు అనేక విద్యాసంస్థలు పునఃప్రారంభం అవుతాయి. దీంతో పిల్లల స్కూల్ ఫీజులు, కొత్త అడ్మిషన్లకు డొనేషన్లు, పాఠ్యపుస్తకాలు ఇలా అనేక ఖర్చులు ఉంటాయి. నగరాల్లో చాలా మంది ప్రజలు జూన్‌ను చూస్తేనే భయపడుతుంటారు. అందువల్ల జూన్, జూలై మాసాల్లోనూ బయ్యర్లు పెట్టుబడులపై పెద్దగా ఆసక్తి చూపే అవకాశం లేదనే ఆందోళనలో రియల్టర్లు ఉన్నారు.
ఏపీ ప్రభావం అంతంతే..
ఏపీ ఎన్నికల ప్రభావం రాష్ట్రంలో బడా రియల్టర్లపై చాలా వరకు ఉంది. ఈ క్రమంలోనే ఎంపీ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం గాడిలో పడుతుందా లేదా అనే చర్చ స్థిరాస్తి రంగ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. ఏపీలో జగన్ వస్తేనే హైదరాబాద్ రియల్టీ బాగుంటుందని, చంద్రబాబు వస్తే మాత్రం హైదరాబాద్ కేంద్రంగా స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించిన ఇన్వెస్టర్లు అమరావతి కేంద్రంగా రియల్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తారనే ప్రచారం ఊపందుకుంది.
త్వరలోనే పూర్వవైభవం
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కొంత వరకు మందగించినప్పటికీ కొద్ది రోజుల్లోనే మళ్లీ పూర్వవైభవం వస్తుందని మరికొందరు రియల్టర్లు పేర్కొంటున్నారు. ఇది ఎన్నికల ప్రభావంతో పాటు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం నేపథ్యంలో వచ్చిన మార్పేనని, ఎంపీ ఎన్నికల తర్వాత హైదరాబాద్ రియల్ బ్రాండ్‌గా విరాజిల్లుతుందని మెజార్టీ రియల్టర్లు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు పెద్దగా రానప్పటికీ, గడిచిన నాలుగు నెలల్లో హైదరాబాద్ మహానగర పరిధిలో భాగంగా ఉన్న జిల్లాలలో 2024 మొదటి నాలుగు నెలలలో వచ్చిన రియల్ రాబడి ఇందుకు నిదర్శనం అని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 2023లో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాలతో పోల్చితే సుమారు 6 శాతం అదనపు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.