calender_icon.png 6 February, 2025 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి

06-02-2025 06:26:51 PM

ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ శాసనమండలి ఎన్నికల సందర్భంగా జిల్లాలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్. పి. శ్రీనివాస్ రెడ్డి, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శుక్లా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ లతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో కలిసి పట్టబద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల శాసనమండలి సభ్యుల ఎన్నికలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో ఏర్పాటు చేసిన 17 పోలింగ్ కేంద్రాల పరిధిలో 416 మంది ఉపాధ్యాయులు, సుమారు 6 వేల మంది పట్టభద్రులు ఉన్నారని తెలిపారు.

జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు చేయాలని, నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగులు, గోడ వ్రాతలు, జెండాలు, ప్రకటనలు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎం. సి. ఎం. సి. కమిటీ ఏర్పాటు చేసి పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలలో వచ్చే ప్రచారాలను నిశితంగా పరిశీలించడం జరుగుతుందని, ఆయా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి అవసరమైన అనుమతులను తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నిఘా బృందాలను ఏర్పాటుచేసి పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. శాసనమండలి ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను ఎలాంటి పొరపాట్లకి తావు లేకుండా స్పష్టంగా రూపొందించాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఓటరు దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 7వ తేదీలోగా పరిష్కరించాలని, పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈనెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగే పోలింగ్ ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎన్నికల సిబ్బందిని నియమిస్తూ వారికి అవసరమైన శిక్షణ అందించేందుకు మాస్టర్ ట్రైనర్లను గుర్తించాలని, ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే బ్యాలెట్ బాక్సులను సరిచూసుకోవాలని, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేయాలని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని, ఫెసిలిటీషియన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. రవాణా నిర్వహణలో భాగంగా ఎన్నికలలో ఉపయోగించవలసిన అన్ని రకాల రవాణా అవసరాలు, లభ్యత వివరాలతో నివేదిక రూపొందించాలని తెలిపారు. కంప్యూటరైజేషన్‌, సైబర్‌ సెక్యూరిటీలో భాగంగా సైబర్‌ సెక్యూరిటీ నిబంధనలకు అనుగుణంగా జిల్లా వెబ్‌సైట్‌ నవీకరణ, ఐ.టి. పనితీరు, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ పర్యవేక్షణ, సాంకేతిక మద్దతు అందించడం జరుగుతుందని, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌లో భాగంగా అధికారులు, అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, మీడియా మొదలైన వాటి కార్యకలాపాలపై ప్రతి రోజు నివేదికను రూపొందించడంపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.

మ్యాన్‌పవర్‌ నిర్వహణలో భాగంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకం, రాండమైజేషన్‌ ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిర్వహించాలని, శిక్షణ నిర్వహణలో భాగంగా ఎన్నికల కార్యకలాపాలలో పాల్గొనే అధికారుల సామర్థ్యం పెంపుదల, శిక్షణ, వేదికల ఏర్పాట్లు, సామాగ్రి పంపిణీ, రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లకు శిక్షణ అందించడం వివరాలు తయారు చేసుకోవాలని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, జిల్లా రక్షణ ప్రణాళికలో భాగంగా రోజు వారిగా రక్షణ చర్యల నివేదిక, రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఖర్చుల పర్యవేక్షణలో భాగంగా పార్టీలు, అభ్యర్థుల వ్యయ పర్యవేక్షణ, అధికారులు, పార్టీల ప్రతినిధులకు ఎన్నికల వ్యయ పర్యవేక్షణపై శిక్షణ,  రిటర్నింగ్‌ అధికారులు, ఇతర నోడల్‌ అధికారుల సమన్వయంతో నివేదికలు సమర్పించడం జరుగుతుందని అన్నారు.

బ్యాలెట్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ల నిర్వహణలో భాగంగా బ్యాలెట్‌ పేపర్‌ / డమ్మీ బ్యాలెట్‌ షీట్‌ / బ్రెయిలీ బ్యాలెట్‌ ముద్రణ, ప్రింటింగ్‌ ప్రెస్‌, పంపిణీ సంబంధిత అంశాల పర్యవేక్షణ, మీడియా, సోషల్‌ మీడియా నిర్వహణలో భాగంగా ఎన్నికల సంబంధిత సమాచారం, పత్రికా ప్రకటనలు, ప్రెస్‌ సమావేశాల ఏర్పాట్లు, పత్రికా కత్తిరింపుల సమర్చణ, మీడియాతో సమాచార మార్చిడి, రోజు వారి నివేదికల నిర్వహణ, సోషల్‌ మీడియాపై పర్యవేక్షించి వివరాలు సమర్పించాలని తెలిపారు. జిల్లాలోని ఓటరు హెల్ప్‌లైన్‌ 1950 నిర్వహణ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కొరకు నియమించబడిన నోడల్‌ అధికారులు వారికి కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, విధుల సంబంధిత కార్యచరణ రూపొందించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.