calender_icon.png 26 December, 2024 | 10:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్తి పంచుకున్నారు.. అంత్యక్రియలకు లేరు

25-12-2024 11:17:57 PM

'జగిత్యాలలో మరో అమానవీయ ఘటన'

 తాను కని, పెంచిన పిల్లలు లేరు

 అయిన వాళ్లు ఆస్తులు పంచుకున్నారు

 అంతిమ సంస్కారానికి మాత్రం ఎవరూ లేరు

జగిత్యాల,(విజయక్రాంతి): "మాయమై పోతున్నడమ్మా, మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు" అన్న 'డాక్టర్ అందెశ్రీ' మాటలు అక్షరసత్యంగా కనిపించిన అమానవీయ సంఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. తాను నవ మాసాలు మోసి, కనిపించిన పిల్లలు లేరు. కానీ కట్టుకున్న వాని మూలంగా సంక్రమించిన కోట్ల రూపాయల ఆస్తి ఉంది.  అవసాన దశలో తనను చూస్తారని ఆశపడ్డ ఆ తల్లి ఆస్తులన్నీ అయినవాళ్ళకు పంచింది.  కానీ ఊపిరి పోయాక, ఆస్తులు పంచుకున్న అయినవాళ్లు రాలేదు. దాంతో పాడె మోసి, దహన సంస్కారాలు చేసేందుకు 'ఆ నలుగురు' కరువయ్యారు. 

జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సాదుల సత్యమ్మ (90) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. అంబులెన్స్'లో శవాన్ని ఇంటి వద్దకు తీసుకురాగా ఆస్తిపంచుకున్న ఆమె మరిది కొడుకులు శవాన్ని ఇంట్లోకి తేనివ్వకపోవడంతో సుమారు 7గంటల పాటూ ఆమె మృతదేహం అంబులెన్స్'లోనే ఉండిపోయింది. చివరికి ఇరుగు పొరుగు వారు కలుగజేసుకొని, పాత ఇంటి తాళం పగలగొట్టి శవాన్ని కొంతసేపు ఉంచి, అదే అంబులెన్స్'లో స్మశానానికి తరలించి అంతిమ సంస్కారాలు చేశారు. సాదుల లక్ష్మణ్, ధర్మపురి ఇరువురు సొంత అన్నదమ్ములు.  లక్ష్మణ్ సత్తెమ్మ దంపతులకు పిల్లలు లేకపోవడంతో తమ్ముడు ధర్మపురి వద్దే ఉంటూ జీవించారు. ఈ అన్నదమ్ములిద్దరికీ కలిపి జగిత్యాల కటిక వాడలో 2 ఇండ్లు, గణేష్ నగర్'లో 2ఇండ్లు, అయ్యప్ప కాలనీలో ఒక ఇల్లు, కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులున్నాయి.

ఆ ముసలమ్మ బాధ్యత వద్దు,  ఆస్తి వద్దని ధర్మపురి పెద్ద కుమారుడు తిరస్కరించగా, కుల పెద్దలు పంచాయతీ చెప్పి ఇరువురికి సమాన బాధ్యతలు అప్పజెప్పారు. దాంతో ఆస్తులన్ని ధర్మపురి కుమారులు ఇరువురు సమానంగా పంచుకున్నారు. 2002లో లక్ష్మణ్ మృతి చెందగా, సత్తెమ్మ ధర్మపురి కుమారులైన ప్రసాద్, రవిల దగ్గర వంతుల వారిగా ఒక్కో నెల ఉంటున్నది. కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైన సత్యమ్మను ఆసుపత్రిలో చేర్పించగా మంగళవారం సాయంత్రం మరణించింది. కాగా ప్రస్తుతం నెలవారి వంతులో భాగంగా ప్రసాద్ వద్ద ఉండగా, ఆయన ఇంట్లో శుభకార్యం ఉందన్న నేపంతో అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాలేదు.

ఆస్తులు పంచుకున్న ఆ ఇరువురు అంత్యక్రియలకు ముందుకు రాకపోగా, శవాన్ని ఇంటిలోకి తేనీయకపోవడంతో మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి 12గంటల వరకు మృతదేహం అంబులెన్స్'లోనే ఉంచారు. చివరికి వాడకట్టు పెద్ద మనుషులు కలగజేసుకొని పాత ఇంటి తాళం పగలగొట్టి, రాత్రంతా శవాన్ని ఆ ఇంట్లో ఉంచారు. కనీసం అంత్యక్రియలు చేయడానికైనా రమ్మని, ఆస్తులు పంచుకున్న ఆ అన్నదమ్ములను పిలిచారు. కారణమేదైనా ఆ రాతి గుండెలు కరుగక వారిరువురు రాలేదు. దాంతో తెల్లవారగానే అదే అంబులెన్స్'లో శవాన్ని స్మశానానికి తరలించి, ఇరుగుపొరుగు వారే అంత్యక్రియలు నిర్వహించారు. గత నెలలో ఇదే జగిత్యాల పట్టణంలో నలుగురు కొడుకున్నా, తల్లిని బతికుండగానే అచేతన స్థితిలో స్మశానంలో వదిలి వచ్చిన సంఘటనను మరిచిపోక ముందే, మరో దారుణం వెలుగు చూడడం స్థానికులను కలచివేసింది.