పీఎంజేఏవైతో రాష్ట్రంలోని 1.15 కోట్ల మందికి లబ్ధి
ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): వృద్ధుల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం దేశ ప్రజల మన్ననలు అందుకుంటుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. 70 ఏండ్లు దాటిన వృద్ధులకు సైతం ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) పథకంలో భాగంగా రూ.5లక్షల వరకు వైద్య బీమా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
వృద్ధుల్లో వయసు పెరిగేకొద్దీ తరచు అనేక వ్యాధుల బారిన పడుతుంటారని.. అలాంటి పరిస్థితుల్లో అనేక కారణాలతో వారిక సరైన చికిత్స అందడం లేదన్నారు. ఏ రకమైన వ్యాధికైనా ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశం ఈ పథకం ద్వారా కల్పించనున్నారని తెలిపారు.
తెలంగాణలో 1.15 కోట్ల మంది లబ్ధిదారులు..
పీఎంజేఏవై పథకం ద్వారా దేశవ్యాప్తంగా 12 కోట్ల కుటుంబాల్లోని 45.83 కోట్ల మంది లబ్ధిదారులు ఇప్పటికే ప్రయోజనం పొందుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలోనూ దాదాపు 30 లక్షల కుటుంబాలకు చెందిన 1.15 కోట్ల మంది ప్రజలు ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారని వివరించారు. 2024, జూలై వరకున్న లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో ఈ పథకం కింద 17.2 లక్షల చికిత్సలు జరిగాయని, వీటి విలువ రూ.3,626 కోట్లు ఉంటుందని చెప్పారు. ఇన్నాళ్లు ఈ పథకాన్ని బీపీఎల్ కుటుంబాలకే వర్తింజేయగా.. ఇక పేద, ధనిక తేడా లేకుండా వయోవృద్ధులందరికీ వర్తింపజేయాలని భావించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.
70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న సీనియర్ సిటిజన్లందరూ కుటుంబ ప్రాతిపదికన ఏడాదికి రూ.5 లక్షల వరకు కవరేజీ పొందనున్నారని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రత్యేకమైన గుర్తింపు కార్డును ఈ పథకంలో భాగంగా అందిస్తారని తెలిపారు. ఈ పథకం కింద వచ్చే రెండేళ్లలో రూ.3,437 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చుచేయనుందని పేర్కొన్నారు. పథకం పరిధిని విస్తరించడంతో 70 ఏళ్లకు పైబడిన 6 కోట్ల మంది (4.5 కోట్ల కుటుంబాలు) లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారని వివరించారు.
పథకానికి మార్పులు చేయడం ద్వారా.. 2.72 కోట్ల లబ్ధిదారులు (1.96 కోట్ల కుటుంబాలు) అదనంగా ప్రయోజనాలు పొందేందుకు అర్హత పొందారని అన్నారు. తెలంగాణలో ఈ సంఖ్య 10 లక్షలుగా ఉందన్నారు. దేశంలోని 70 ఏళ్లు, ఆ పైబడిన వయసు కలిగిన సీనియర్ సిటిజన్లందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసినందుకు ప్రధానిమోదీకి సీనియర్ సిటిజన్ల తరఫున ధన్యవాదాలు తెలియచేశారు.