30-03-2025 12:06:30 AM
బెళగావి జిల్లా ఖానాపూర్‌లో ఘటన..
50 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు..
బెంగళూరు: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో సైబర్ క్రైమ్ వలలో చిక్కుకొని వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం రేపింది. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి రూ. 50 లక్షలు పోగొట్టుకోవడాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయిన దియాగో నజరత్ (83) తన భార్య ప్లవియానా నజరత్ (79)తో కలిసి ఖానాపూర్‌లోని బీడీ గ్రామంలో నివసిస్తున్నారు. మార్చి 26న దియాగో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకోగా.. ఆయన భార్య ఫావియా విషం తాగి చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు రెండు పేజీల లేఖను రాశారు. ‘మా చావుకు సుమిత్ బిర్రా, అనితల్ అనే ఇద్దరు వ్యక్తులు కారణం. సుమిత్ బిర్రా అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి ఢిల్లీలో టెలికాం ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నానని చెప్పాడు. మీరు కొనుగోలు చేసిన సిమ్‌కార్డును చట్ట విరుద్ధమైన ప్రకటనలకు ఉపయోగిస్తున్నారని పేర్కొన్నాడు.
ఆ తర్వాత అనిల్ యాదవ్ అనే వ్యక్తి ఫోన్ చేసి క్రైమ్ బ్రాంచ్ అధికారి అని చెప్పి.. మీరు సైబర్ క్రైమ్‌కు పాల్పడ్డారు. ఈ కేసులో మిమ్మల్ని విచారించాలి.. మీ ఆస్తులు, ఆర్థిక విషయాలు వివరాలు చెప్పాలని, లేకపోతే సిమ్ కార్దు దుర్వినియోగంపై కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. అలా జరగకుండా ఉండాలంటే రూ. 50 లక్షలు చెల్లించాలని బెదిరించారు. వాళ్ల మాటలకు భయపడిపోయి విడతల వారీగా 50 లక్షలు చెల్లించాం. ఆ తర్వాత కూడా ఫోన్ చేసి డబ్బులు చెల్లించాలని వేధించారు. దీంతో ఏం చేయాలో తోచలేదు. ఈ వయసులో ఎవరి దయా దాక్షిణ్యాల మీద బతకొద్దనే నిర్ణయానికి వచ్చాం. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నాం’ అని లేఖలో పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు.