calender_icon.png 19 April, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

03-04-2025 12:00:00 AM

  • లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం
  • ఆరు పార్కింగ్ స్థలాల ఏర్పాటు
  • ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
  • జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి  ఆదేశం

హుజురాబాద్, ఏప్రిల్ 2 (విజయాక్రాంతి):  ఈనెల 4 నుండి జరగనున్న అపర భద్రాదిగా విరాజిల్లుతున్న కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పా ట్లు చేస్తున్నారు. 

ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి  అధికారులను ఆదేశించారు. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై దేవస్థానంను సందర్శించిన అనంతరం ఇల్లందకుంట తహసిల్దార్ కార్యాలయంలో  బుధవారం సమీక్ష నిర్వహించారు.  వివిధ శాఖల అధికారులతో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ ఆలం సమీక్షించారు. 

4 నుండి 16 వరకు ఇల్లందకుంట దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. అన్ని శాఖల అధికారు లు సమన్వయంతో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశిం చారు. ఇందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అన్నారు. వేసవి దృష్ట్యా  విద్యుత్ శాఖ అధికారులు అంతరాయం లేకుండా చూడాలని, అధిక లోటును దృష్టిలో ఉంచుకొని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

భక్తులు వివిధ మార్గాల ద్వారా వచ్చే అవకాశం ఉన్నందున  సూచికల బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. భారీకేడ్లు, లైటింగ్, తాగునీటి సదుపాయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్, రెవిన్యూ అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లలో భద్రతా ప్రమాణాలు పాటించాలని అన్నారు. జిల్లాతో పాటు ఇతర జిల్లా నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపించాలని సూచించారు.

స్వామివారి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ అయ్యేలా చూడాలని అన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు అవసరమైతే ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని తెలిపారు. శానిటేషన్ సిబ్బందికి భోజన వసతి  కల్పించాలని అన్నారు. ఫైర్9 సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు.  ఈసారి లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అన్నారు. 

ఉత్సవాల కోసం 6 పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సుమారు వెయ్యి వాహనాలు పార్కింగ్ చేయవచ్చని అన్నారు. సీసీ కెమెరాలతో పాటు  ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని అన్నారు. అడిషనల్ కలెక్టర్లు ప్రపోల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, ఆర్డీవో రమేష్, ఏసీపి శ్రీనివాస్, ఆలయ ఈవో సుధాకర్ పాల్గొన్నారు.