calender_icon.png 20 January, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

20-01-2025 07:51:22 PM

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు...

నిజామాబాద్ (విజయక్రాంతి): గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu) అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా సమగ్ర వివరాలతో జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రతా (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి శకటాలను ప్రదర్శించాలని కలెక్టర్ సూచించారు. వీటితో పాటు గృహాజ్యోతి, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, రైతు రుణ మాఫీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాల ప్రాధాన్యతను చాటేలా శకటాలను ప్రదర్శించాలని సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.

వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి, పశు సంవర్ధక, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, ఫిషరీస్, ఇరిగేషన్ తదితర శాఖల పనితీరును చాటేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించేందుకు గాను శాఖల వారీగా పరిమితితో కూడిన ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన సిబ్బందికి ప్రాధాన్యతనిస్తూ, ఈ నెల 22వ తేదీ లోగా పేర్లను ప్రతిపాదనల రూపంలో సిఫార్సు చేయాలని అధికారులకు సూచించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. దేశభక్తిని చాటేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, డీఆర్డీఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.