calender_icon.png 12 January, 2025 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకశిలా నగర విద్వత్కవి అగస్త్యుడు

16-09-2024 12:00:00 AM

చతుస్సప్తతి కావ్యోక్తి

వ్యక్త వైదుష్య సంపదే

అగస్త్యాయ జగత్యస్మిన్

స్పృహయేత్కో నకోవిధః॥

అంటూ సంస్కృత కవయిత్రి, కాకతీయ రా జుల ఆడబిడ్డ, ‘మధురా విజయం’ గ్రంథకర్త గంగాదేవి తన కావ్యంలో చేసిన పూర్వకవి స్తుతిద్వారా, ‘అగస్త్యుడు 74 రచనలు చేసిన మహాకవి’గా తెలుస్తున్నది. ఆమె తన గురువైన క్రియాశక్తికి నమస్కరించిన పిదప వాల్మీకి, వ్యా సుడు, కాళిదాసు, భట్ట బాణుడు, భారవి, దం డి, భవభూతి, లీలాశుకుడు, తెలుగు కవి తిక్క న వంటి మహామహులను స్తుతిస్తూ, ఆ క్ర మంలో అగస్త్యుని కూడా స్తుతించింది. కానీ, అగస్త్యుడు రాసిన 74 రచనలలో కేవలం మూడు రచనలు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి.

అవి ‘బాల భారతం’, ‘నలకీర్తి కౌముది’, ‘కృష్ణ చరిత్రం’. ఈ మూడు కృతులే ఆయన ప్రతిభకు అద్దం పడుతున్నాయి. ఇవేగాక కొన్ని కృతుల పేర్లుకూడా తెలుస్తున్నాయి. అవి ‘ఏకాదశ ముఖ హనుమత్కవచమ్’, ‘లక్ష్మీస్తోత్రమ్’, ‘భక్తి సూత్రాణి’, ‘సరస్వతీ స్తోత్రమ్’. ఈ నాలుగింటిలో ‘ఏకాదశ ముఖ హనుమత్కవచమ్’ అగస్త్య సంహితాంతర్గతమైందని పం డితులు వివరించారు. అదే విధంగా సుప్రసిద్ధ ‘యాకుందేందు తుషారహార ధవళా..’ అనే సరస్వతీ స్తోత్రం ఈ కవి రచించిన ‘సరస్వతీ స్తోత్రమ్’ లోనిదిగా పండితులు గుర్తించారు. 

కాకతీయుల కాలం వాడు

కాకతీయ ప్రతాపరుద్రుని కాలాన్ని 1294 చరిత్రకారులు నిర్ధారించడాన్నిబట్టి ఈ అగస్త్యుడు అతని సమకాలినుడని అనుకుంటే, ఇతడు కూడా 13వ శతాబ్దపు చివరి పాదంలోనో, 14వ శతాబ్దపు తొలిపాదంలోనో జీవించి ఉంటాడనుకోవాలి.  అయితే, ఇతనిని గురించి ఆనాటి కవులెవ్వరూ తమ గ్రంథాలలో స్తుతించలేదు. కేవలం గంగాదేవి ‘మధురా విజయం’ సంస్కృత కావ్యంలో స్తుతించినట్లు మాత్రమే కనబడుతున్నది. గంగాదేవి కాలం కూడా 1350 ప్రాంతమే కనుక ఈ కవి ప్రతాపరుద్ర చక్రవర్తి కాలం వాడేనని అనడానికి కొంత ఆస్కారం ఉంది.

నాటి చక్రవర్తి ప్రతాపరుద్రుని వద్ద కోశాధ్యక్షుడుగా ఉండి, తదనంతర కాలంలో విజయనగర స్థాపనకు కారకుడైన బుక్కరాయల కోడలైన గంగాదేవి స్తుతించిన కారణంగా అగస్త్యుని కాలం ప్రతాపరుద్రుని కాలమేనని సాహిత్య చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. కాకతీయ రాజ్య పతనం వరకూ వీరంతా ఓరుగల్లు నివాసులే గనుక ఈ కవికూడా ఓరుగల్లు నివాసియే అనికూడా భావించవచ్చు. పైగా ‘గంగాదేవికి గురువైన విశ్వనాథునికి ఇతడు మేనల్లుడు’ అనే విషయమూ విశ్వనాథుని రచన అయిన ‘సౌగంధికాప హరణం’ వల్ల తెలుస్తున్నది. అందులో విశ్వనాథుడు తన మేనమామ అయిన అగస్త్యుని స్తుతించాడు. అంతేగాక, రాజ చూడామణీ దీక్షితుడనే కవి రచించిన ‘రుక్మిణీ కల్యాణం’ అనే నాటకంలో కూడా అగస్త్యుని స్తుతించినట్లు తెలుస్తున్నది.

ప్రభావితమైన కవులు ఎందరో

‘మధురా విజయం’ కావ్యకర్త గంగాదేవి పేర్కొన్నట్టు అగస్త్యుడు గొప్ప ‘కావ్యోక్తి’ వైదుష్యం కలిగిన పండితుడు. అందుకే, తదనంతర కవులెందరో ఆయన కావ్యాల్లోని సుందర భావాలవల్ల ప్రభావితులైనారు. సందర్భం సహకరించినప్పుడు వారు తమ రచనల్లో ఆ భావాలను ప్రతిఫలింప జేశారు. అగస్త్యుడు తన ‘నలకీర్తి కౌముది’లో కావ్యనాయిక నాసికను వర్ణించిన విధం ఇలా ఉంది

“భృంగా నవాప్తి ప్రతిపన్నఖేదా

కృత్వా వనే గంధఫలీ తపోలమ్‌

తన్నాసికా భూదనుభూత గంధా

స్వపార్శనేత్రే కృతభృంగ సేవ్యా॥”

ఈ శ్లోకంలో చెప్పిన సుందరమైన భావాన్నే ‘వసుచరిత్ర’ కారుడు తన కావ్య నాయిక అయిన గిరిక నాసికను వర్ణిస్తూ

“నానాసూనవితాన వాసనల 

నానందించు సారంగ మే

లా నన్నొలదటంచు గంధఫలి 

బల్‌కోనందవంబది యో

షా నాసాకృతి బూనె సర్వసుమన స్సౌరభ్య సంవాసియై

బూనెం బ్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్‌”

అని చెప్పిన పద్యంలో ప్రతిఫలింపజేశాడు. ఇది అగస్త్యుని వైదుష్యానికి నిదర్శనం. ఇటువంటి పలు శ్లోకాలలో సుందర భావాలను తెలుగు, సంస్కృత కవులు తమ తమ కావ్యాల్లో సందర్భోచితమైనప్పుడు ఉపయోగించుకున్నారు. ఇదంతా అగస్త్యుని కావ్యోక్తి వైదుష్యమే అన్నది అక్షర సత్యం. అగస్త్యుడు కేవలం కావ్యాలు మాత్రమే రాయలేదు. ఆయన ‘రత్నశాస్త్రము’ రచించినట్లు, ఒక నిఘంటువును కూర్చినట్టు కూడా మాన్యులు కీ.శే. పోతుకుచ్చి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు తెలిపారు. అయినా కూడా గంగాదేవి ఆయన కావ్య ప్రశంస మాత్రమే చేసింది. ఆయన ‘కావ్యోక్తి’ ఘనమైందిగా, వ్యక్తీకరణ వైదుష్యం అసాధారణమైందిగా చెప్పింది. అంతేగాక, ‘అగస్త్యాయ జగత్యస్మిన్ స్పృహయే త్కోన కోవిదః’ అన్న మాటలో కొంత మరోభావన మదిలో మెదిలే రీతి కనిపిస్తుంది. 

74 రచనల్లో మూడు మాత్రమే అందుబాటులో!

అగస్త్యుడు నక్షత్ర మండలంలో వెలిగే ఒక నక్షత్రం. అగస్త్యోదయం కాగానే జలమంతా స్వచ్ఛమై మాలిన్య రహితమై పోతుంది. అదే విధంగా ఆయన రచనలోని కావ్యోక్తులు మనసుకు పట్టగానే విద్వజ్జనుల మనస్సులు కూడా కాలుష్యానికి దూరమై ప్రసన్నతను పొందుతాయన్న అర్ధాంతర స్ఫూర్తి ఉందేమోనని పండితులు అభిప్రాయపడ్డారు. ఈ సాదృశ్యాన్నిబట్టే అగస్త్యుడు పవిత్రుడు, అభిలషణీయుడు అయినాడని అనవచ్చు. అగస్త్యుడు రచించిన 74 రచనల్లో అందుబాటులో ఉన్న కేవలం మూడింటిలో ‘బాల భారతం’ ఒకటి. ఇది పద్యకావ్యం. ఇందులో కథావస్తువు మహాభారత సంబంధమైందే. 20 సర్గలున్న ఈ కావ్యం అద్భుత వర్ణనలు, అలంకారాలతో ఎంతో గొప్ప రచనగా కీర్తిని పొందింది.

ఈ కావ్యానికి రాయలవారి మంత్రి అయిన తిమ్మరుసు వ్యాఖ్య రాయడం ఒక విశేషం. ఆ వ్యాఖ్యకు ‘మనోహర వ్యాఖ్య’ అని పేరు పెట్టడమూ ఎంతో సార్థకతను సంతరించుకుంది. ఒక సందర్భంలో చంద్రాస్తమయ వర్ణన చేస్తూ  ‘కురువంశం చంద్రవంశం కదా! తన పేరనున్న ఈ వంశం కురుక్షేత్ర యుద్ధంలో నాశనం కావడం చూడలేక చంద్రుడు అస్తమించాడు’ అని పేర్కొన్నాడు. ఈ ప్రయోగం తదనంతర తెలుగు కవులకూ ఎంతో స్ఫూర్తినిచ్చింది. తిక్కన కర్ణపర్వంలో ఇదే రీతిలో వర్ణించడమే దీనికి ప్రమాణం. 

ప్రతిఫలించిన ఉదాత్త భావాలు

అగస్త్యుని మరో లభ్యరచన ‘నలకీర్తి కౌముది’ అనే కా వ్యం. ఇంతకు పూర్వమే ఇం దులోని శ్లోకభావ ప్రతిఫల నం వసుచరిత్రకారుని కావ్యం లో ఏ విధంగా ఉందో తెలుసుకున్నాం. దాదాపుగా విజ యనగర రాజుల కాలంలో వెలువడ్డ అనేక కావ్యాల్లో ఆయన రచనలోని ఉదాత్తభావాలు ప్రతిఫలించాయని కొం దరు విమర్శకులు ప్రకటించారు. బహుశా కాకతీయ రాజ్య పతనానంతరం బుక్కరాయలచే స్థాపితమైన విజయనగర రాజ్యానికి కవులు, పండితులు కూడా వెళ్లి ఉండవచ్చునన్న చరిత్రకారుల అభిప్రాయం సత్యమైందే అనిపిస్తుంది. గంగాదేవి వారి కోడలు కావడమూ ఈ అభిప్రాయాన్నే బలపరుస్తుంది. అందుకే, అగస్త్యుని రచనలు అప్పటి కవులపై గొప్ప ప్రభావాన్ని చూపి ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

‘శ్రీకృష్ణ చరిత్రము’ చంపూ కావ్యం

‘శ్రీకృష్ణ చరిత్రము’ లభిస్తున్న అగస్త్యుని రచనల్లో మూడవది. ఇది చంపూ కావ్యమని తెలుస్తున్నది. గద్య రచన వలెనే దీనిని రచించినా మధ్యమధ్య వృత్తాలు కూడా చేర్చిన కారణంగా సాహితీవేత్తలు దీనిని ‘ఒక చంపూ కావ్యం’గానే అభిప్రాయపడ్డారు. సింహభాగం దీనిని గద్యరచనగానే గుర్తించాలి. ఆయన గద్య రచనా శైలి సుప్రసిద్ధ సంస్కృత మహాకవి బాణుని ‘కాదంబరి’ని స్ఫురింపజేస్తుంది. ఆ కావ్యమంతా ఆ ధోరణిలోగాక చాలాచోట్ల సరళమైన గద్య రచనా విధానాన్ని అగస్త్యుడు అనుసరించాడు. ‘పద్య (శ్లోక) గద్య రచనల్లో అగస్త్యునిది అందె వేసిన చెయ్యి’ అని ఆయన లభ్యరచనలనుబట్టి తెలుస్తున్నది. లభిస్తున్న మూడు రచనల వల్లనే ఆయన ప్రతిభ ఎంత గొప్పదో, ఎందరు కవుల హృదయాల్లో నిలిచిపోయిందో గమనిస్తే సాహితీవేత్తలు ఆశ్చర్యచకితులు కాక తప్పదు.

మహోన్నత కవుల సరసన..

ఇంతటి ప్రతిభామూర్తియైన ఈ మహాకవి రచనలన్నీ లభించకపోవడం తెలుగువారి దురదృష్టమే. లభిస్తున్న మూడు రచనల్లోనే దృశ్యమానమవుతున్న ఆయన ప్రతిభ లభించని మిగతా 71 రచనల్లో ఇంకా ఎన్ని వెలుగుల్ని నింపుకున్నదో అనిపిస్తుంది. అందుకే, గంగాదేవి ప్రత్యేకంగా సంస్కృత మహాకవుల సరసన అగస్త్యుడిని చేర్చి స్తుతించింది. “వ్యాస, వాల్మీకి, కాళిదాసాది మహోన్నత కవుల సరసన నిలువగలిగిన మహాకవి గనుకనే అగస్త్యుడు కాకతీయ సామ్రాజ్య కాలపు గొప్ప సంస్కృత కవులలో ఒకడుగా విలసిల్లినాడు” అని సుప్రసిద్ధ కవి, రచయిత, చరిత్ర పరిశోధకుడు డా.సంగనభట్ల నర్సయ్య అభిప్రాయం పడ్డారు. ఇది అక్షరసత్యం. 

గన్నమరాజు గిరిజా మనోహరబాబు

9949013448