calender_icon.png 4 April, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహ్.. అద్భుతం..!

30-03-2025 10:53:40 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): చిన్నపిల్లలు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు బానిసవుతున్న సమయంలో వారిని సరైన మార్గంలో నడిపించడం కోసం బెల్లంపల్లిలోని ఏకదంత మిత్రమండలి సభ్యులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, పలువురిచే శభాష్ అనిపించుకుంటున్నారు. పిల్లలు ఎంతో సుజనాత్మకంగా, ఉత్సాహంగా ఉంటారు. వారిలోని ఈ సృజనాత్మకతను వెలికి తీసి వారి విద్యాభివృద్ధికి తోడ్పడేలా వేసవి సెలవుల్లో చిన్నారులు తమ సమయాన్ని వృధా చేయకుండా విజ్ఞానం వైపు దృష్టి పెట్టెలా ఒక ప్రణాళిక రూపొందించారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ఇళ్లల్లో టీవీలు, సెల్ ఫోన్లలో కాలక్షేపం చేస్తున్న పిల్లలను విజ్ఞాన అంశాల వైపు మళ్ళించే ప్రయత్నాలు చేపడుతున్నారు.

కాలనీ ప్రజల సహకారంతో పలువురు ఇళ్లపై విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించే విలువైన సమాచారాన్ని బొమ్మల రూపంలో పిల్లలతోనే పెయింటింగ్ వేయిస్తూ వేసవిలో ఖాళీ సమయాన్ని చిన్నారులు వారికి తెలియకుండానే సద్వినియోగపరుచుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఏకదంతా మిత్రమండలి చేస్తున్న ఈ వినూత్న కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరు వాహ్.. అద్భుతం అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాలనీలోని గోడలపై అందమైన సందేశాత్మకమైన, విద్యా సంబంధిత విషయాలు చిత్రించడం ద్వారా పిల్లలు చదువు పట్ల ఆసక్తిని పెంచుకుంటున్నారు. రంగురంగుల బొమ్మలు, అక్షరాలు, గణిత సూత్రాలు, శాస్త్రీయ విషయాలు గోడలపై చిత్రించడం ద్వారా వారిలో జ్ఞానాన్ని పెంపొందిస్తున్నారు.

గోడలపై చిత్రాలను వేసే కార్యక్రమం చిన్నారుల భవిష్యత్తుకు ఒక మంచి పునాది వేస్తుందని, వారిని మంచి పౌరులుగా, విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి సహాయపడుతుందని కాలనీవాసులు నమ్ముతూ ఏకదంతా మిత్రమండలి సభ్యులకు తమదైన రీతిలో సహకరిస్తున్నారు. ప్రస్తుతం బెల్లంపల్లి పట్టణంలోని 28వ వార్డులో చిన్నారులు మొబైల్ ఫోన్లకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండి చదువుపై, కళ లపై దృష్టి పెడుతున్నారు. ప్రతిరోజు రాత్రి కాలనీలోని చిన్నారులు, యువకులు, మహిళలు కలిసి విజ్ఞాన సమాచారాన్ని గోడలపై చిత్రీకరిస్తూ భవిష్యత్ తరాలకు విలువైన సందేశాత్మక సమాచారాన్ని ప్రతి ఇంటి గోడ పై నిక్షిప్తం చేస్తున్నారు.

పిల్లలు కాలనీలో ఆటలాడుకుంటున్న సమయంలో కూడా గోడలపై చిత్రించిన సమాచారాన్ని నిత్యం నెమరు వేస్తూ విజ్ఞాన తీపిదనాన్ని రుచి చూస్తున్నారు. ఎంతో విలువైన సమాచారాన్ని గోడల పైకెక్కించి కాలనీని విజ్ఞాన భాండాగారంగా తీర్చిదిద్దుతున్న ఏకదంత మిత్రమండలి సభ్యులు బొంతల శ్రీనివాస్ ,భోగి ఇంద్రకరణ్, లింగాల కిషోర్, ముల్కాల సాయి, పొట్ట అంజనీకుమార్, దమ్మ విజయ్, దమ్మ రోహిత్, పొట్ట నిఖిల్, లింగాల మోహన్, ఎలమద్రి సాత్విక్, గుండ అక్షయ్, బన్నీలు నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. వారి సేవలకు కాలనీ ప్రజలే కాకుండా విలువైన చిత్రాలను వీక్షించిన ప్రతి ఒక్కరు హ్యాట్సాఫ్ యూత్ అంటూ ప్రశంసిస్తున్నారు.