31-03-2025 05:16:35 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ అంతటా సోమవారం ఈద్-ఉల్-ఫితర్‌ను సాంప్రదాయ ఉత్సాహంతో జరుపుకున్నారు. మసీదులు, ఈద్గాలలో ముస్లీం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నగరంలోని మీర్ ఆలం ఈద్గా, మక్కా మసీదు, ఇతర ప్రదేశాలలో ప్రార్థనల కోసం ప్రజలు గుమిగూడారు. ఇక్కడ మీర్ ఆలం ఈద్గా వద్ద ప్రార్థనలు చేసిన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ(AIMIM chief Asaduddin Owaisi) ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ... మన దేశంలో శాంతి బలపడుతుందని, అందరికీ న్యాయం జరుగుతుందని తాము ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తామని ఆయన విలేకరులతో అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలోని తన అసెంబ్లీ నియోజకవర్గంలోని మధిరలో పార్టీ నాయకుడి నివాసంలో జరిగిన ఈద్ వేడుకలకు హాజరయ్యారు. ఈద్ ప్రార్థనలు సజావుగా సాగేందుకు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర బొగ్గు గనుల మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, బిఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.