calender_icon.png 23 October, 2024 | 7:04 AM

ఎగ్గొట్టేటోడే ఒట్లేస్తడు!

05-05-2024 12:12:19 AM

ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని ఆగం చేసిన కాంగ్రెస్

నాడొచ్చిన నీళ్లు, కరెంటు యాడ పోయినయ్?

ఆరు గ్యారెంటీల అమలు ఏమైంది?

మంచిర్యాల, మే 4 (విజయక్రాంతి): నిజాయితీగా పనిచేసేటోడు ఒట్లు పెట్టుకోడని, ఎగ్గొట్టేటోడే ఒట్లు పెడుతాడని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్కడికి పోతే అక్కడ ఒట్లు పెట్టుకునుడు తప్ప చేసేదేమీ లేదు’ అని ఎద్దేవా చేశారు. పని చేసేటోడు చేసి చూపిస్తాడని పేర్కొన్నారు. మంచిర్యాల ఐబీ వద్ద శనివారం ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. పెద్దపల్లిలో ఎన్నికలు ఆగర్భ శ్రీమంతుడికి.., బొగ్గు గని కార్మికుడికి మధ్య జరుగుతున్నాయని.. కార్మికుల కష్టనష్టాలు తెలిసిన కొప్పుల ఈశ్వర్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 

తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల్లోనే ఆగం చేసిందని కేసీఆర్ మండిపడ్డారు. ‘తెలంగాణ ఐదు నెలల కింద ఎట్లుండె! ఇప్పుడు ఎట్లుంది? బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు ఎట్లుండె? పట్టణాల్లో పేదవారికి రూపాయికి నల్లా నీరు, గ్రామాల్లో పేదవారికి అందించిన నీరు, సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణలక్ష్మి ఇప్పుడు ఏమయ్యాయో ప్రజలు ఆలోచన చేయాలి’ అని కోరారు. అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ బూటకపు హామీలను నమ్మొద్దని సూచించా రు. ‘కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమైనయ్? కల్యాణలక్ష్మి తులం బంగారం, రైతు బంధు వస్తున్నాయా? ఒక్క ఫ్రీ బస్సు తప్ప ఏవీ అమలు కాలేదు. ఫ్రీ బస్సుతో ఆడోల్లు కొట్టుకుంటున్నరు. ఆటో రిక్షా కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. లాగుల్ల తొం డలు పెడుతాం, జైల్లో పెడుతాం అని బెదిరిస్తే కేసీఆర్ భయపడడు’ అని తేల్చి చెప్పారు.  

రుణ మాఫీ ఏమైంది?

సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న రేవంత్‌రెడ్డి చేసిందేమిటని కేసీఆర్ ప్రశ్నించారు. ‘రైతులకు రైతుబంధు ఇయ్యలే, రైతు బీమా లేదు, ధాన్యానికి రూ.500 బోనస్ లేదు. 24 గంటల కరెంటు లేదు, పాత రోజులు తీసుకొస్తున్నారు. నాలుగైదు నెలల కిందట వచ్చిన సాగునీరు ఇప్పుడేమైంది? రైతుబంధు ఏమైంది? రుణమాఫీ ఏమైంది? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానన్నడు. అందుకే లక్షల ఎకరాల్లో పంటలు ఎండబెట్టిండు. నాడు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరిట అభివృద్ధి చేసుకున్నం. ఇప్పుడా పరిస్థితి లేదు. హరితహారం చెట్లు ఎండిపోతున్నయ్. పంచాయతీలకు డబ్బులు ఇవ్వడం లేదు. క్రీడాప్రాంగణాల్లో సౌకర్యాలు కనుమరుగయ్యాయి. ఎన్నికల హామీలు మరచి రాక్షస పాలన సాగిస్తున్నారు. కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు ఐదు నెలలుగా బంద్ చేశారు. రైతుల నోట్లో మట్టి కొట్టింది. చివరకు వడ్లు కొంటలేరు. రైతులు ఏం పాపం చేసిండ్రు?’ అని కేసీఆర్ ప్రశ్నించారు. దళిత బిడ్డల కోసం తాము దళితబంధు తెస్తే, 1.30 లక్షల మందికి వెళ్లాల్సిన దళితబంధు డబ్బులు రేవంత్ ప్రభుత్వం వాపస్ తీసుకున్నదని
ధ్వజమెత్తారు.  

మంచిర్యాలకు అన్యాయం

మంచిర్యాలకు అన్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదని కేసీఆర్ ఆరోపించారు. చెన్నూరు ఎత్తిపోతల పథకం ఆగిపోయిందని, మంచిర్యాలలో కావాలనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆపేశారని, రైతులు పండించిన పంటలు కనీసం కొనే దిక్కే లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అభివృద్ధి కోసం ఆదిలాబాద్ జిల్లాలో మూడు జిల్లాలు ఏర్పాటు చేసుకొంటే, రేవంత్‌రెడ్డి వాటిని రద్దు చేస్తా అంటున్నారని ధ్వజమెత్తారు. సింగరేణి ప్రైవేటుపరం కావద్దంటే ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని కోరారు. తెలంగాణ హక్కులు కాపాడేది బీఆర్‌ఎస్ పార్టీ ఒక్కటేనని స్పష్టంచేశారు. అంతకు ముందు ఇందారం వద్ద గోదావరి నదికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోడ్ షోలో బీఆర్‌ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.