రాజాపూర్ (విజయక్రాంతి): ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు సహాయ శక్తుల కృషి చేస్తానని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి అన్నారు. బుధవారం రాజాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న ఐదు డి ఏ లో గాను ఒకే డిఏ ప్రకటించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం మిగిలిన నాలుగు డిఏలను వెంటనే ప్రకటించాలని కోరారు. అదేవిధంగా పి ఆర్ సి కమిటీ నివేదికను వెంటనే ప్రకటించి దానిని అమల్లోకి తీసుకురావాలని కోరడం జరిగింది.
ఉపాధ్యాయులు తాము అవసరాల నిమిత్తమై దాచిపెట్టుకున్న జిపిఎఫ్ అమౌంటు మరియు మెడికల్ రియంబర్స్మెంట్, టీఎస్ జెఎల్ఐ మరియు సరెండర్ లీవ్ లు పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే ఉపాధ్యాయుల ఖాతాలో జమ చేయాలని కోరారు. కేజీబీవీ మహిళా ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అలాగే 317 జీవో ద్వారా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు వెంటనే వారి యొక్క స్థానిక జిల్లాలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్థిక సంబంధంలేని అనేక ఉపాధ్యాయ సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో తపస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొల్లం సునీల్ కుమార్, ఎంఇఓ సుధాకర్, బాబు నాయుడు, మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, రేణుక, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.