* భారత విదేశాంగ శాఖ
* క్షమాభిక్ష తిరస్కరించిన యెమన్ అధ్యక్షుడు రషీద్
* నెల రోజుల్లో శిక్ష అమలుకు అవకాశం
న్యూఢిల్లీ/సనా, డిసెంబర్ 31: యెమన్ దేశంలో ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతదేశంలోని కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు ఆ దేశాధ్యక్షుడు రషీద్ అల్ అలిమి మరణ శిక్షను ఖరారు చేశారు. ప్రియ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను దేశాధ్యక్షుడు తిరస్కరించారు.
అయితే మరణశిక్ష అమలుకు మాత్ర నెల రోజుల గడువు ఇచ్చారు. ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందిస్తూ నిమిష మరణ శిక్ష అంశం తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రియ ను కాపాడడానికి ఆమె కుటుంబం చేస్తున్న ప్రయత్నాలు, వారు పడుతున్న ఆవేదనను తాము అర్థం చేసుకున్నామని పేర్కొన్నారు.
మత్తు మందు ఇచ్చి హత్య
పాలక్కాడ్‌కు చెందిన ప్రియ 2014లో భర్త, కూతురుతో కలిసి యెమన్ వెళ్లారు. ఏడాది తరువాత సొంతంగా క్లినిక్ ఏర్పాటు చేసుకోవాల ని నిర్ణయించుకుంది. యెమన్‌లో విదేశీయులు ఏదైనా సొంత వ్యాపారం, లేదా సంస్థ ఏర్పాటు చేయాలనుకుంటే స్థానికులను పార్ట్‌నర్‌గా ఉంచుకోవాలి.
స్థాని కుడైన తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని పార్ట్‌నర్‌గా చేసుకుని అల్‌అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను ప్రారంభించారు. ప్రియను తలాల్ వేధించి ఆమె పాస్‌పోర్ట్, ఇతర పత్రాలను లాక్కున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో 2017లో తలాల్‌కు మత్తుమందు ఇచ్చి తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని భావించింది. అయితే డోస్ ఎక్కువ కావడంతో అతడు చనిపోయాడు.