calender_icon.png 26 March, 2025 | 11:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలుకు కసరత్తు

22-03-2025 12:46:58 AM

 జిల్లాలో 4.73లక్షల ఎకరాల్లో సాగు

 సుమారు 12లక్షల  టన్నుల ధాన్యం దిగుబడి 

అంచనా కొనుగోలు లక్ష్యం  4.3 లక్షల టన్నులు

సూర్యాపేట, మార్చి 21 (విజయక్రాంతి): యాసంగిలో రైతులు పండించిన వరి కోత దశకు చేరింది.  జిల్లాలోనీ హుజుర్నగర్ నియోజకవర్గంలో ఇప్పటికే కోతలు జరుగుతుండగా పలు ప్రాంతాల్లో వరి కోత దశలో ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ రెండో వారంలోగా చేతికొచ్చే అవకాశం ఉంది. దీంతో ధాన్యం కొనుగోలు చేసేందుకు సేకరణ కేంద్రాలు ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

జిల్లాలో 4.75 లక్షల ఎకరాలలో వరి సాగు

జిల్లాలో యాసంగిలో 4.75లక్షల ఎకరాల్లో సాగు చేశారు. సుమారు 12 లక్షల మెట్రిక్టన్నుల ధాన్యం దిగుబడి రానుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాలో దాదాపు 318 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్ని కేంద్రాలకు సరిపడా గోనె సంచులు, టార్పాలిన్లు, వరిని కొలిచే కాంటాలు, వరి తేమ ను చూసే పరికరాలను అందుబాటులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి రైతుల వద్ద దాదాపు 4.3 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే అవకాశం ఉందని అంచనా. ఈ మేరకు పౌరసరఫరాల అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు . కొనుగోలులో భాగంగా వచ్చే బుధవారం కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నదని సమాచారం. 

గోదాములు, మిల్లుల్లో ధాన్యం నిల్వకు చర్యలు

యాసంగిలో పండించిన ధాన్యం  కొనుగోలు ఏప్రిల్ 10 నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ధాన్యం నిల్వ చేసేందుకు గోదాములు రైస్ మిల్లుల్లో సరిపడా స్థలం, రవాణా సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు, రైస్మిల్లులకు, గోదాములకు తరలించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అకాల వర్షాలు వచ్చిన పక్షంలో ధాన్యం తడిసే అవకాశం ఉన్నందున, గతానుభవాలను  దృష్టిలో పెట్టుకుని ఈసారి ధాన్యం సేకరణ వీలైనంతా వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. 

దాన్యం సేకరణకు సన్నాహాలు చేస్తున్నాం 

యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. జిల్లాలో మొత్తం 318 వరకు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం.  పలు చోట్ల వరికోతలు ఏప్రిల్లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ధాన్యం రాకను బట్టి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నాం. జిల్లాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం.

 రాజేశ్వర్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి