- నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తా
- అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి
కరీంనగర్, అక్టోబరు 18 (విజయక్రాంతి): ఉత్తర తెలంగాణకు తలమానికంగా ఉన్న కొండగట్టు జేఎన్‌టీయూను యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని, నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు.
మినీ స్టేడియం, రామాలయం గ్రౌండ్, మున్సిపల్ పార్కులో వాకర్స్‌తో ముఖాముఖి నిర్వహించి రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలుపాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనను గెలిపిస్తే నిరుద్యోగ, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల సమస్యలపై పోరాడతానని హామీ ఇచ్చారు.
పెద్దల సభలో చట్టాల రూపకల్పనలో ముందుంటానని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రథమ కర్తవ్యంగా కృషి చేస్తానని అన్నారు. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏల మంజూరు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని, ప్రైవేట్ ఉద్యోగులకు హెల్త్‌కార్డుల మంజూరుకి కృషి చేస్తానని అన్నారు.