16-03-2025 06:18:24 PM
వర్గీకరణ వల్ల షెడ్యూల్ కులాల మనుగడకే ముప్పు...
ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచాలి...
ఎస్సీ వర్గీకరణను అశాస్త్రీయంగా చేస్తే సహించం....
జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు... పిల్లి సుధాకర్
ఇల్లందు (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధత చేయాలనే ప్రయత్నం మానుకోవాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల కేంద్రంలో జాతీయ మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ చేయడం అశాస్త్రీయమని, దీనిపై పాలకులు, పార్టీలు రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. వర్గీకరణ వల్ల షెడ్యూల్ కులాల మనగడకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధత చేయాలనే పాలకుల ప్రయత్నం ఉపసంహరించుకొని, ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్ పెంచేలా ప్రయత్నాలు ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించారు. రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రలో భాగంగానే వర్గీకరణ మార్గం సులువు కానున్నదని అన్నారు. వర్గీకరణపై అసెంబ్లీలో చట్టబద్ధత చేయాలని ప్రయత్నిస్తే ప్రజా కోర్టులో ఓటుతో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పాలకులు అత్యుత్సాహంతో ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో చట్టం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మాలమహానాడు కార్యకర్తలు ప్రత్యక్ష పోరాటాలకు, న్యాయ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఇల్లందు మండల కేంద్రానికి చెందిన మాల మహానాడు నాయకుడు బేతమల్ల రవితేజ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం, అతని దశదినకర్మ నేడు జరగనున్నడంతో మాల మహానాడు నాయకులు మానవతా దృక్పథంతో చలించి వితరణ చేసిన 50 కేజీల బియ్యం, కిరాణా సరుకులను రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుమల్ల సుందర్రావు, జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఏడెల్లి గణపతి, జిల్లా ఉపాధ్యక్షులు పల్లంటి రమేష్, జిల్లా మహిళా కార్యదర్శి మద్దెటి జయ, పాల్వంచ పట్టణ అధ్యక్షులు ధారా చిరంజీవి, ఇల్లందు నియోజకవర్గ సీనియర్ నాయకులు కాలే పుల్లయ్య, జ్ఞాన సుందరం, వేమూరి సాల్మన్ రాజు, సందా ప్రవీణ్ కుమార్, గుర్రం బిక్షపతి, చెలిమెల బాబురావు, మలిపెద్ది కమలాకర్, చెన్నుమల్ల రామకృష్ణ, జిల్లా నాయకులు శనగ ప్రభాకర్, జీవి రత్నం తదితరులు పాల్గొన్నారు.