calender_icon.png 20 November, 2024 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి డిక్లరేషన్ అమలుకు కృషి

10-09-2024 04:48:25 AM

  1. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యం 
  2. రిజర్వేషన్లతోనే వెనుకబడిన వర్గాలకు న్యాయం
  3. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్‌ను అమ లు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని  ఎమ్మెల్సీ, టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం బీసీ రిజర్వేషన్ల సాధనపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని సామాజిక వర్గాలకు సమానమైన ప్రాధాన్యం ఇవ్వాలని, సమానమైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

రిజర్వేషన్ల ద్వారానే వెనుకబడిన వర్గాల కు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో బీసీ రిజర్వేషన్లకు తూట్లు పడ్డాయని, ఆ ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గాయని మండిపడ్డారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ కుల గణన అంశాన్ని ప్రధాన ఎజెండాగా తెరమీదకు తీసుకొచ్చి సామాజిక విప్లవానికి నాంది పలికారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెడితే బాగుంటుందని అభిపాయపడ్డారు. అలాగే అసెంబ్లీలోనూ బీసీ రిజర్వేషన్లపై చట్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీతో బీజేపీ 240 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చిందన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు, తెలం గాణ బీసీ జన సమితి అధ్యక్షుడు జస్వంత్‌కుమార్, టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పల్లె వినయ్, బైరి రమేశ్, నిజ్జన రమేష్, వివిధ సంఘాల నాయకులు ఎం.నరసయ్య, లక్ష్మి, అరుణ్ కుమార్, సాయికుమార్, అనంతయ్య, సైదులు, దేవిక, నాగరాజు, రాకేష్ సాయి, రాంచందర్, ఇస్మాయిల్, సురేష్, రసూల్ పాల్గొన్నారు.