calender_icon.png 23 November, 2024 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనశక్తి దళ ఏర్పాటుకు ప్రయత్నం

23-11-2024 04:06:54 AM

భగ్నం చేసిన ఆదిలాబాద్ పోలీసులు

పిస్తోల్స్ తరలిస్తున్న నలుగురి అరెస్ట్

ఆదిలాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): నిషేధిత జనశక్తి దళాన్ని బలోపేతం  చేసేందుకు పిస్తోల్స్‌ను తరలిస్తున్న నలుగురిని ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం జిల్లా పోలీస్ హెడ్ కార్టర్‌లో శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఏపీలోని కర్నూలు జిల్లాలో ప్రభుత నిషేధిత జనశక్తి దళ ఏర్పాటుకై నిందితులు ఆర్థికంగా బలపడి, ఆయుధ సేకరణకు పూనుకున్నారు. వారణాసి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు పిస్తోళ్లను తరలిస్తున్న ఇద్దరిని పక్కా సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

వారిని విచారించగా మరో ఇద్దరి నిందితులు పట్టుబడ్డారు. నిందితుల్లో వోట్టి వెంకటరెడ్డి, మైల దిలీప్, అవులపాటి హిమకాంత్‌రెడ్డి, నల్లగంటి ప్రసన్న రాజు ఉన్నారు. వెంకటరెడ్డి గతంలో జనశక్తి పార్టీలో పనిచేసి అరెస్టయ్యాడు. జైలు నుంచి విడుదలై ఉమ్మ డి కర్నూలు జిల్లాలో జనశక్తిని మళ్లీ బలోపేతం చేయాలనుకున్నాడు. అంతేకాకుండా సూర్యాపేట జిల్లాలో తన మిత్రుడి హత్య చేసిన వారిని చంపాలనుకున్నాడు.

అందుకు నల్లగంటి ప్రసన్నరాజు ఆర్థిక సహాయం చేశాడు. ఆ తర్వాత వెంకటరెడ్డి, తన అనుచరుడు హేమకాంత్‌రెడ్డితో రెస్టారెంట్‌ను నడు పుతున్న దిలీప్ ముగ్గురు కలిసి రెస్టారెంట్‌లో పనిచేసే భైరవ్ చెప్పిన వ్యక్తితో వారణాసికి వెళ్లారు. భైరవ్ చెప్పిన వ్యక్తి బీహార్ రాష్ర్టం మృంగార్ రైలే స్టేషన్‌కు వెళ్లి పిస్టల్స్, బుల్లెట్లను సేకరించి ఇచ్చాడు. వాటిని తీసుకుని ఏపీకి వెళ్తున్న దిలీప్, హిమకాంత్‌రెడ్డిలను ఆదిలాబాద్ జిల్లా చాంద (టి) బైపాస్ రోడ్డు వద్ద పక్కా సమాచారంతో ఆదిలాబాద్ రూర ల్ ఎస్సై ముజాహిద్, సిబ్బంది కలిసి పట్టుకున్నారు.

వారు ఇచ్చిన సమాచారం  మేరకు ఏపీ, బీహార్ రాష్ట్రాలకు ప్రత్యేక పోలీసు బృందాలను పంపి వెంకటరెడ్డి, ప్రసన్న రాజులను అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు పిస్తోళ్లు, 8 మ్యాగజిన్స్, 18 రౌండ్స్ బుల్లెట్స్, 6 సెల్ ఫోన్ లు, కారును సాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఆదిలాబాద్ జిల్లా పోలీసు అధికారులను, సిబ్బందిని ఏస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కాగా వెంకట్‌రెడ్డిపై ఇదివరకే టాడా కేసు, సంఘ విద్రోహ, హత్య వంటి 10 కేసుల్లో నిందితుడిగా జిల్లా ఎస్పీ తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ సురేందర్‌రావు, డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐలు ఫణిదర్, కరుణాకర్, సాయినాథ్, ఎస్సై ముజాహిద్ పాల్గొన్నారు.