calender_icon.png 27 November, 2024 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారామంజనేయ ఆలయ అభివృద్ధికి కృషి

27-11-2024 01:35:19 AM

  1. దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ
  2. సబ్బితంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పెద్దపల్లి, నవంబర్ 26 (విజయక్రాంతి): పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలోని  సీతారామాంజనేయస్వామి దేవాలయాన్ని రూ.50 లక్షలతో అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ  శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం పెద్దపల్లి మండలం సబ్బితం సీతారామంజనేయ ఆలయ అభివృద్ధి పనులకు కలెక్టర్ కోయ శ్రీ హర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావులతో కలిసి మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు.

  సురేఖకు ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు మంత్రి, ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రజల అభీష్టం మేరకు సబ్బితం గ్రామంలో ఉన్న దేవాలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖలో విలీనం చేసుకుని రూ.50 లక్షలతో అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.

ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన చేశామని, వీటిని సకాలంలో నాణ్యతతో పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పేర్కొన్నారు. సబ్బితం గ్రామంలోని ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని, ఇక్కడ విగ్రహాలు పక్కన ఊరి వారు తీసుకుని వెళ్తే , మళ్లీ తీసుకుని వచ్చి ప్రతిష్టించి ఆలయం నిర్మించారని చెప్పారు.

సీతారాములతోపాటు ఆంజనేయుడి, ఈశ్వరుడు, నవగ్రహాలను కూడా ప్రతిష్టించారని చెప్పారు. సబ్బితం గ్రామానికి నమ్మకమైన ఆలయంగా సీతారా మాంజనేయస్వామి ఆలయం ఉందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆలయాన్ని దేవదాయ శాఖలో కలపాలని కోరినందున దేవాదాయ శాఖలో విలీనం చేసి అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు.

ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ.. సబ్బితం సీతారామాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆలయం నిర్మించేందుకు భూమి ఇవ్వడమే కాకుండా నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు.