31-03-2025 07:59:22 PM
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్..
మందమర్రి (విజయక్రాంతి): చెన్నూరు నియోజకవర్గంలో వైద్య సేవల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని నియోజకవర్గంలో కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో వన్ మెడి హబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించి మాట్లాడారు. మొబైల్ మెడికల్ క్యాంపులో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని గ్రామీణులు, పట్టణ ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు.
ముఖ్యంగా ప్రజలు తమ ఆహార అలవాట్లను మార్చుకొని పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో వైద్య సేవలు అందించేందుకు వన్ మెడి హబ్ సంస్థ ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, వైద్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.