జిల్లా కలెక్టర్ రాజర్షి షా...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా(Collector Rajarshi Shah) అన్నారు. కావున ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ఆయన సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఆర్ఎం సొలొమాన్ తో కలిసి ఆర్టీసీ సిబ్బంది చేపట్టిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో రక్తం ఎంతో అవసరం అని అందుచేతనే ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వాహనాలను నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని అన్నారు. ప్రమాదాల నివారణకు ముఖ్యంగా డ్రైవర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్.ఎం ప్రణీత్, ప్రవీణ్ కుమార్, డిపో మేనేజర్ కల్పన, ఆర్టీసీ డిస్పెన్సరీ డాక్టర్ కీర్తి, ఉస్సేన్ ఉన్నారు.