calender_icon.png 16 January, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు కృషి చేయాలి

16-01-2025 01:26:35 AM

* జీవవైవిద్య పంటలను సాగు చేసే రైతులను ప్రోత్సహించాలి 

* చిరుధాన్యాల పంటల ఆహారం కు పెరిగిన డిమాండ్ 

* వడ్డీ గ్రామంలో ఘనంగా ప్రారంభమైన పాత పంటల జాతర ఉత్సవాలు..

* జీవవైవిద్య సంరక్షకులకు సన్మానం.. ఎడ్లబండ్లకు పూజలు చేసిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

సంగారెడ్డి, జనవరి 15 (విజయ క్రాంతి): అంతరించిపోతున్న జీవ వైవిధ్యాన్ని కాపా డేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయవలసిన అవసరం ఉందని కృషి విజ్ఞాన కేంద్రాల దక్షిణ భారతదేశం డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా తెలిపారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ మండలంలోని వడ్డీ గ్రామంలో డెక్కన్ డెవలప్ మెంట్  సొసైటీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో పాత పంటల జాతర ఉత్సాహాలలో పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో జీవవైవిద్యాన్ని కాపాడేందుకు కేంద్రప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు.

అంతరించిపోతున్న చిరు ధాన్యాలను కాపాడేందుకు ప్రభుత్వం రైతులకు విత్తనాలు ఎరువులు పంపిణీ చేసి ప్రోత్సహిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు ప్రకృతిలో ఉన్న జీవరాసులను కాపాడితేనే జీవవైవిద్యం ఉంటుందన్నారు. చిరు ధాన్యాల సాగును పెంచేందుకు ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుందన్నారు.

గతంలో ఎక్కడ చూసినా చిరుధాన్యలే కనిపించే వాని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. చిరుధాన్యాలు సాగుచేసిన రైతులకు గిట్టుబాటు ధరతోపాటు మార్కెట్ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

రెండు మూడు సంవత్సరాలలో చిరుధాన్యాల పంటలు పెరిగే అవకాశం ఉందన్నారు.పట్టణ ప్రాంతాలలో ఎక్కడ చూసినా ప్రస్తుతం సేంద్రియ ఎరువులతో పండించిన చిరుధాన్యాలు అమ్ముతున్నామని బోర్డులు కనిపిస్తున్నాయన్నారు. కూరగాయలు సైతం ఆర్గానిక్ ఎరువులతో పండించామని బోర్డులు పెట్టి అమ్మకాలు చేస్తున్నారన్నారు.

చిరుధాన్యాలను సాగు చేసే రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, చిరుధాన్యాల సాగులో అధిక దిగుబడులు సాధించేందుకు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నా రని తెలిపారు. చిన్న సన్నకారు రైతులు చిరుధాన్యాలను సాగు చేసి అందరికీ ఆదర్శంగా నిలవడం జరిగిందన్నారు. మహిళా రైతులు తమకు ఉన్న ఎకరం రెండు ఎకరాల వ్యవసాయ భూముల్లో వర్షాధారంగా చిరుధాన్యాల పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు.

పాత పంటల జాతరలో ఎడ్లబండ్లకు పూజలు ..

ప్రతి గ్రామంలో ప్రజలు గ్రామదేవతలకు పూజలు చేసి జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. డెక్కన్ డెవలఫ్ మెంట్  మహిళా సంఘాల వారు ప్రతి ఏడాది ఎడ్లబండ్లను చిరుధాన్యాలతో అలంకరణ చేసి గ్రామాలను జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. ఎడ్లబండ్లకు ప్రత్యేక పూజలు చేసి పంటలు బాగా ఉండాలని రైతులు సుఖసంతోషాలతో ఉండాలని పూజలు చేసి జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. 25 సంవ త్సరాలుగా డిడిఎస్ మహిళా సంఘాలు ఆధ్వర్యంలో పాత పంటల జాతరను జహీరాబాద్ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు.

ఈ జాతర ఉత్సవాలకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు, మహిళా రైతులు పాల్గొని చిరుధాన్యాల పై చర్చ చేస్తారు. పూర్వకాలం గ్రామాలలో పశువుల ఎరు వుతో పంటలు సాగు చేసేవారని రైతులు తమ అభిప్రాయాలను తెలిపారు. ఎప్పుడు కూడా రసాయన ఎరువులు పంటలకు వేసే వారం కాదన్నారు.

పెంట ఎరువుతో పంటలు పండించి ఆహారంగా ఇండ్లలో ధాన్యమును ఏడాది పాటు నిల్వ చేసుకునే వారమన్నారు. ప్రస్తుతం వాతావరణ మార్పులు, ప్రజల్లో మార్పులు రావడంతో రసాయన ఎరువులతో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు అధికంగా రసాయన ఎరువులు వినియోగిస్తున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.  

జీవవైవిద్య సంరక్షకులకు ఘనంగా సన్మానం

జహీరాబాద్ ప్రాంతంలో చిరుధాన్యాలు సాగు చేస్తున్న మహిళా రైతులను ఘనంగా సన్మానించి అభినందించారు. జీవ వైవిద్యమును కాపాడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న మహిళా రైతులను ఘనంగా సన్మానించారు. న్యాల్కల్ మండలంలోని వడ్డీ గ్రామానికి చెందిన నడిమి దొడ్డి శోభమును ఐసిఎఆర్ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా సన్మానం చేశారు. ఝరా సంఘం మండలం ఎల్గొయి గ్రామానికి చెందిన ఎర్ర నర్సమ్మను డాక్టర్ ప్రసాద్ రావు సన్మానం చేశారు.

జహీరాబాద్ మండలంలోని ని కాసింపూర్ గ్రామానికి చెందిన లక్ష్మ ని రూరల్ సీఐ హనుమంతు సన్మానించారు. జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామానికి చెందిన మేతరి అనిషమ్మను వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ విజయకుమార్ సన్మానం చేశారు. ఝరా సంఘం మండలం పొట్టి పల్లి గ్రామానికి చెందిన రత్నమ్మను సీనియర్ జర్నలిస్టు పతంగి రాంబాబు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా రైతుల అభిప్రాయంతో రాసిన హార్వెస్ట్ హెవెన్ సీడ్స్ అప్ డైవర్సిటీ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహిత, ప్రముఖ వైద్య నిపుణులు, నిమ్స్ హైదరాబాద్, డాక్టర్. డి. ప్రసాద్ రావు, తెలంగాణ హైకోర్టు న్యాయవాది  సి. హెచ్. రవి కుమార్, రైతు స్వారాజ్, ప్రముఖ సామాజిక కార్యకర్త, ఉషా సీతామహాలక్ష్మి, సీనియర్ జర్నలిస్టు పతంగి రాంబాబు, జహీరాబాద్ రూరల్ సిఐ హనుమంత్, న్యాలకల్ ఎంపీడీవో కౌలస్ రాజశేఖర్, బసంత్ పూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త  డా. యం. విజయ్ కుమార్, రైతు బి. శ్రీనివాస్ రెడ్డి,  బసంతపూర్, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు గౌసోద్దిన్, జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, డిడిఎస్ జాయింట్ డైరెక్టర్ గిరిధర్ బాబు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దివ్య వెలుగూరి, ప్రతినిధులు మాణిక్యం, జాతర కోఆర్డినేటర్లు వినయ్ కుమార్, తో పాటు మహిళా రైతులు, రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.