20-03-2025 12:00:00 AM
నిజామాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. రైతులు ఎక్కడ కూడా ఏ దశలోనూ ఇబ్బందులు తలెత్తకుండా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలని అన్నారు.
రబీ వరి ధాన్యం కొను గోళ్ళకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరం లో బుధవారం ఆయా శాఖల అధికారుల తో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలు, ఐకెపి సీసీలు, మెప్మా ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 20వ తేదీ నుండి జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచేలా అన్ని చర్యలు తీసుకున్నా మని తెలిపారు.
జిల్లాలో యాసంగిలో సాధారణానికి మించి అధిక విస్తీర్ణంలో వరి పండించారని, లక్షా 69 వేల హెక్టార్ల పైచిలుకు విస్తీర్ణంలో వరి సాగు చేశారని అన్నా రు. మొత్తం 11.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేయగా, 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు.
ఇందు లో 6.80 లక్షల మెట్రిక్ టన్నులు సన్న ధాన్యం, దొడ్డు రకం 2.20 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని నిర్ణయించామన్నా రు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈసారి జిల్లాలో 664 కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేస్తున్నామని, వీటిలో సన్న ధాన్యం సేకరణ కోసం 472 కేంద్రాలు, దొడ్డు ధాన్యం సేకరణకు 192 కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ వివరించారు.
సహకార సంఘాల ఆధ్వర్యంలో అత్యధికంగా 481 కేంద్రాలు, ఐకెపి 107, డీసీఎం ఎస్ ద్వారా 68, మెప్మా ఆధ్వర్యంలో 8 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామ ని అన్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు లోబడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తిస్థాయిలో మద్దతు ధర పొందేలా క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం ‘ఏ’ గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ. 2320, సాధారణ రకానికి రూ. 2300 ధర చెల్లించడం జరుగుతుందన్నారు. మద్దతు ధరతో పాటు సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లించడం జరుగుతుందన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలోనూ రైతులకు అవసరమైన అన్నిమౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
పంట విక్రయం విషయంలో రైతులు ఇబ్బందులకు గురికాకుండా, పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా కేంద్రాల వద్ద తగిన నీడ, నీటి వసతి కల్పించాలన్నారు. సరిపడా సంఖ్యలో తేమ కొలిచే యంత్రాలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా తూకం, తరుగు వంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, ధాన్యం సేకరణ ముగిసేంత వరకు పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.
నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయి మద్దతు ధర అందేలా చూడాల్సిన గురుతర బాధ్యత అధికారులపై ఉంద న్నారు. తహసీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు ప్రతిరోజూ క్రమం తప్పకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ కొనుగోళ్ల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ చేయాలని, ఏమైనా సమస్యలు గమనించిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు.
రైతుల నుండి ధాన్యం సేకరించిన వెంటనే టాబ్ ఎంట్రీలు జరపాలని, తద్వారా వారికి త్వరితగతిన చెల్లింపులు జరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. బిల్లుల చెల్లింపుల్లో అనవసర తప్పి దాలకు పాల్పడుతూ, నిర్లక్ష్యానికి తావిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
సంబంధిత శాఖల అధికారులందరూ సమిష్టిగా, సమన్వయం తో పనిచేస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. ఎఫ్.ఏ.క్యూ ప్రమాణాలకు లోబడి బాగా ఆరబెట్టి, శుభ్రపర్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా క్షేత్ర స్థాయిలో రైతులను చైతన్యపరచాలని, రైతుల నుండి ఫిర్యాదు రాకుండా చూసుకోవాలని, ధాన్యం సేకరణలో క్షేత్రస్థాయి అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు.