జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే...
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు పకడ్బందీగా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dotre) అన్నారు. జిల్లా కేంద్రంలోని జూబ్లీ మార్కెట్ సమీపంలో రైతు భరోసా పథకంపై నిర్వహిస్తున్న వ్యవసాయ భూముల సర్వేను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయానికి యోగ్యమయ్యే భూములను మాత్రమే రైతు భరోసా పథకానికి వర్తింపచేయాలని సూచించారు. నాలా, ఇండ్లు, వెంచర్లు, ప్లాట్లుగా మార్చిన భూములను జాబితాలో తీసుకోవద్దన్నారు. అనర్హులకు ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వ పథకాలను వర్తింప చేయొద్దని నిష్పక్షపాతంగా సర్వే చేయాలని ఆదేశించారు.
పట్టణంలో పలుచోట్ల కూరగాయల అమ్మకాలు జరపడం వల్ల జూబ్లీ మార్కెట్ లో కూరగాయల విక్రయాల వ్యాపారం నష్టతరంగా ఉందని కలెక్టర్ దృష్టికి వ్యాపారులు తీసుకపోగా సంబంధిత అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం జనకాపూర్ నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల సర్వేను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే, వ్యవసాయ శాఖ అధికారి మిలింద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ భుజంగరావు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.