calender_icon.png 1 February, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు న్యాయం చేయడానికి కృషి చేయాలి

01-02-2025 12:04:21 AM

కమిషన్ చైర్మన్ వెంకటయ్య

మేడ్చల్, జనవరి 31(విజయ క్రాంతి): ఎస్సీ ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారానికి ఎలాంటి ఒత్తిడిలకు తలొగ్గకుండ నిష్పక్షపాతంగా వ్యవహరించి ఆ వర్గాలకు న్యాయం జరిగేలా కృషి చేయాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బి .వెంకటయ్య అన్నారు. శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్రాసిటీ కేసులకు సంబంధించి తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. పౌర హక్కుల రక్షణ చట్టం, అట్రాసిటీ చట్టం కచ్చితంగా అమలయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇప్పటివరకు నమోదైన కేసులు వివరాలు వాటి పురోగతిని చైర్మన్ అడిగి తెలుసుకున్నారు.

కేసులు పెట్టిన వారిపై రకరకాల ఒత్తిడులు వస్తుంటాయని దీనిని దృష్టిలో పెట్టుకొని బాధితులకు పోలీసులు, ఇతర శాఖల అధికారులు అండగా నిలవాలన్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు లేకుండా చూడాలన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ గౌతం మాట్లాడుతూ కమిషన్ సలహాలు సూచనలు పాటిస్తూ, బాధితులకు తక్షణమే న్యాయం చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిపిలు కోటిరెడ్డి, పద్మజా రెడ్డి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు శామీర్పేట మండలం దేవర యాంజల్, మేడ్చల్ మండలం ఎల్లంపేటలో జరిగిన పౌర హక్కుల కార్యక్రమంలో పాల్గొన్నారు.