13-03-2025 10:56:40 PM
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలి
కార్పొరేటర్ కొప్పుల నర్సింహ రెడ్డి
ఎల్బీనగర్: ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టపర్చాలని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని కార్పొరేటర్ కొప్పుల నర్సింహ రెడ్డి(Corporator Koppula Narasimha Reddy) అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానన్నారు. మన్సూరాబాద్ ఉన్నత ప్రభుత్వ పాఠశాల, మన్సూరాబాద్ చౌరస్తాలోని బీసీ కాలనీ ప్రైమరీ స్కూల్ లో నెలకొన్న సమస్యలను గురువారం ఆయన పరిశీలించారు. ప్రధానమైన రోడ్డు, మరుగుదొడ్ల సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను డీఈవో, ఎంఈవో దృష్టికి తెచ్చానన్నారు.
గత ప్రభుత్వం తీరులోనే కొత్త ప్రభుత్వం కూడా బార్లు, వైన్స్ లపై ఉన్న శ్రద్ధ పేద విద్యార్థుల చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలలపై చూపడం లేదన్నారు. మన్సూరాబాద్ చౌరస్తా బీసీ కాలనీ ప్రైమరీ పాఠశాలలో నేనే స్వయంగా రూ. 50వేలతో నూతన గోడను నిర్మించానన్నారు. నా మిత్రుడు అరుణ్ తేజ్, ఓ ప్రైవేట్ విద్యాసంస్థ అందజేసిన రూ. 2 లక్షలతో మరుగుదొడ్లు, ప్రహరీ, గేట్లను ఏర్పాటు చేస్తున్నారని, ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలో ఉన్న ఖాళీ స్థలంలో వారం రోజుల్లో పవర్ వాటర్ బోర్ వేయించి, వేసవికాలంలో నీటి సమస్య తీర్చుతానని తెలిపారు. అరుణ్ తేజ్ తన సొంత నిధులతో సుమారు రూ. 10 లక్షలతో ప్రైమరీ, ఉన్నత పాఠశాల భవనాలకు రంగులు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు యాదగిరి, కవితా రెడ్డి, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు మునగాల హరీశ్ రెడ్డి, నాయకులు నాంపల్లి శంకరయ్య, ఉపేందర్ రెడ్డి, యంజాల జగన్, శ్రీధర్ గౌడ్, సిద్దు పాల్గొన్నారు.