calender_icon.png 10 January, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పసుపు రైతును ఆదుకునేందుకు రాజకీయాలకు అతీతంగా కృషి జరగాలి

09-01-2025 10:20:51 PM

వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి... 

నిజామాబాద్ (విజయక్రాంతి): అనేక ఒడిదుడుకులను అధిగమిస్తూ, పవిత్రమైన పసుపు పంటను సాగు చేస్తున్న రైతాంగం పడుతున్న ఇబ్బందులను పరిష్కరించి వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు రాజకీయాలకు అతీతంగా కృషి జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి కోరారు. చైర్మన్ కోదండరెడ్డి నేతృత్వంలో వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, కె.వి.నరసింహారెడ్డి, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, ఎం.భవాని తదితరులతో కూడిన బృందం గురువారం నిజామాబాద్ జిల్లాలో పసుపు సాగు చేస్తున్న ఆర్మూర్ డివిజన్ లోని ఆయా ప్రాంతాలలో పర్యటించి క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్న పరిస్థితులను పరిశీలించారు. పసుపు రైతులను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కొండా లక్ష్మణ్ బాపూజీ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ రాజిరెడ్డి తదితరులతో కలిసి పసుపు రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, ట్రేడర్లు, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, శాత్రవేత్తలు, స్పైసెస్ బోర్డు అధికారులు తదితర వర్గాల వారితో అవగాహన సదస్సు నిర్వహించారు.

సుగంధ ద్రవ్యాల బోర్డు ఆధ్వర్యంలో జిల్లాలో నెలకొల్పిన స్పైసెస్ బోర్డు ద్వారా పసుపు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న తోడ్పాటు గురించి సంబంధిత అధికారులు వివరించగా, ఆ సమాచారాన్ని క్షేత్రస్తాయిలోని ప్రతి పసుపు రైతుకు తెలిసేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చైర్మన్ కోదండరెడ్డి సూచించారు. కాగా, ఒకే రకమైన నాణ్యత కలిగిన పసుపు పంటకు స్థానికంగా తక్కువ ధర చెల్లిస్తుండగా, పక్కనే ఉన్న మహారాష్ట్రలో అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారని సదస్సులో పాల్గొన్న పసుపు రైతులు చైర్మన్ దృష్టికి తెచ్చారు. స్థానికంగా కూడా కర్క్యుమిన్ ఆధారిత పసుపు మార్కెట్ ను అందుబాటులోకి తేవాలని, అధిక దిగుబడిని అందించే నాణ్యమైన వంగడాలను అందించాలని, పసుపును ఉడికించేందుకు ఎలక్ట్రిక్ బాయిలర్లు, పాలిషింగ్ యంత్రాలను రాయితీపై అందించాలని, మార్కెట్ యార్డులో దళారీ వ్యవస్థ లేకుండా చేయాలని, పసుపు పంటకు ధర నిలకడగా ఉండేలా చూడాలని రైతులు కమిషన్ ను కోరారు. కూలీల కొరత నెలకొని పెట్టుబడి ఖర్చులు గణనీయంగా పెరిగిన నేపధ్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను వ్యవసాయంతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ తదితరులు సైతం సదస్సులో పాల్గొని పసుపు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ.. పసుపు రైతులు ప్రస్తావించిన అంశాలను, క్షేత్రస్థాయి పర్యటనలో తాము పరిశీలించిన విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. రాష్ట్ర రైతాంగానికి న్యాయం జరగాలని, సాగు రంగం లాభాల బాటలో పురోగామించాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణి సమస్యల అధ్యయనం కోసం కమిటీని నియమించి, కొత్త రెవెన్యూ చట్టం అమలులోకి తెస్తున్నారని గుర్తు చేశారు. పసుపు సాగులో ప్రముఖ పాత్రను పోషించే నిజామాబాద్ జిల్లా రైతులు పంట సాగులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, శుభకార్యాలలో, ఔషధాలలో, సౌందర్య సాధనాలలో వినియోగించే పవిత్రమైన పసుపు పంటను సాగుచేసే అన్నదాత ఇక్కట్లకు లోనవుతుండడం విచారకరమన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంతైనా ఉందన్నారు.

రైతులు కూలీల కొరతను అధిగమించేలా వారికి సరైన ప్రత్యామ్నాయాలు చూపేందుకు ఉద్యానవన, వ్యవసాయ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు చొరవ చూపాలన్నారు. ముఖ్యంగా ఆధునిక యంత్రీకరణ విధానాలను రైతుకు చేరువ చేయాలని సూచించారు. ఒకే రకమైన నాణ్యత కలిగిన పసుపు పంటకు పొరుగున ఉన్న మహారాష్ట్రలో ఎక్కువ ధర, స్థానికంగా తక్కువ ధర లభిస్తోంది అంటే ఎక్కడో లోపం ఉన్నట్టు తెలుస్తోందని, అలాంటి వాటిని సరిచేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. మార్కెట్ యర్డులలో దళారి వ్యవస్థ లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సదస్సులో అదనపు కలెక్టర్ అంకిత్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, అధిక సంఖ్యలో పసుపు రైతులు పాల్గొన్నారు. అంతకుముందు సదస్సులో పాల్గొనేందుకు కలెక్టరేట్ కు చేరుకున్న వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.