calender_icon.png 20 January, 2025 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రి క్షేత్ర అభివృద్ధికి కృషి

05-07-2024 12:17:00 AM

సౌకర్యాల కల్పనపై త్వరలో సీఎం సమీక్ష

రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

యాదాద్రి భువనగిరి, జూలై 4 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సన్నిధిలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, ఎంపీటీసీల పదవీ విరమణ సన్మాన సమావేశంలో ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యతో కలిసి మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధి పేరుతో సేకరించిన భూమిలో అవసరం లేని దానిని ఆయా రైతులకు తిరిగి అప్పగించడానికి ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. కొండపై ఆటోలను నిషేధించడంతో ఉపాధి కోల్పోయిన యువకులను దృష్టిలో పెట్టుకొని తిరిగి పునరుద్ధరించినట్లు తెలిపారు. బస్వాపూర్ రిజర్వాయర్‌ను రాబోయే రెండేండ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి రీ సర్వే జరపనున్నట్టు పేర్కొన్నారు. కొలనుపాక బ్రిడ్జి, ఆలేరు బైపాస్ పనులను పూర్తి చేయడం జరుగుతుందన్నారు.

మిషన్ భగీరథ ద్వారా భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ఇంటింటికి తాగునీరు అందించడానికి రూ.210 కోట్లు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆగస్టు 15లోగా రైతులందరికి యాదాద్రి నరసింహుడి సాక్షిగా రూ.2 లక్షల రుణమాఫీ అమలు జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. అయిదేండ్ల పాటు ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. పదవీ విరమణ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో సమస్యలపై తనకు గాని ఎమ్మెల్యే, ఎంపీ, అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.  కార్యక్రమంలో ఎంపీపీ చీర శ్రీశైలం, వైస్ ఎంపీపీ నన్నబోలు ప్రసన్న, ఎంపీటీసీలు,  తదితరులు పాల్గొన్నారు.