కాప్రా (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కాప్రా సర్కిల్, మల్లాపూర్ డివిజన్ పరిధిలోని బాబా నగర్ లో సుమారు 22 లక్షలతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, వాటర్ వర్క్స్ డీజీఎం సతీష్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, డివిజన్లలో నిధులు కేటాయించి భూగర్భ డ్రైనేజ్ పనులను చేపడుతున్నామన్నారు. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా స్థానికులు పనులను పరిశీలించాలని ఆయన సూచించారు. మల్లాపూర్ డివిజన్లో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ వేణుగోపాల్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.