ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ గృహం మంజూరు చేయాలి..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): స్థానిక శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు చొరవతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులుగా ఉన్న ప్రతి కుటుంబానికి చేర్చే విధంగా కృషి చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్'లో శుక్రవారం చుంచుపల్లి మండలం, పెనగడప గ్రామపంచాయతి 'వనమానగర్'కు చెందిన 30 కుటుంబాలు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ సాబీర్ పాషా సమక్షంలో సిపిఐలో చేరాయి. వీరికి ఎర్రకండువా కప్పి పార్టీలోని ఆహ్వానించారు. అనంతరం జరిగిన సమావేశంలో సాబీర్ మాట్లాడుతూ... సంక్షేమ పథకాల ప్రతి పేదకుటుంబానికి చేరాలన్నదే కంమ్యూనిస్టు పార్టీ లక్ష్యమని అందుకోసం ప్రభుత్వంపై పోరాడేందుకు వెనుకాడబోమన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిపేర్లు రాజకీయాలకు తావులేకుండా జాబితాలో చేర్చి పథకాలు అందించాలని, అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
సింగరేణి స్థలాల పేరుతో పేదల ఇండ్లను ఖాళీచేసి నిర్వాసితులను చేసే చర్యలను సింగరేణి యాజమాన్యం మానుకోవాలని, సంస్థకు అవసరం లేని స్థలాలను ప్రభుత్వానికి అప్పగించి పేదలకు న్యాయం చేయాలని కోరారు. సింగరేణి నిర్వాసిత కుటుంబాలకు ప్రస్తుత ధరలకు అనుగుణంగా పరిహారంతో పాటు ప్రత్యామ్నాయ గృహవసతి కల్పించే బాధ్యత సింగరేణి యాజమాన్యానిదేనన్నారు. పార్టీలో చేరుతున్న నూతన సభ్యులు ప్రజలకు సేవలందించాలని సూచించారు. సిపిఐలో చేరిన ముఖ్యుల్లో దొమ్మేటి శ్రీనివాస్, తోట నవీన్, బోళ్ల సాయికుమార్, గుండ్ల రమేష్, తమ్మిశెట్టి సురేష్, వేముల నాగమణి, తోట స్వరూప తదితరులు తదితరులు వున్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి, జి వీరాస్వామి, ఎస్ నాగేశ్వర్ రావు, నీడలా సుధాకర్, మన్నెం వెంకన్న, మల్లేష్, తిరుపతి, మన్నెం భాస్కర్, కట్టా శంకర్, ఉదయ్, భద్రరావు తదితరులు పాల్గొన్నారు.