26-04-2025 05:36:40 PM
ఇల్లెందు (విజయక్రాంతి): జమ్మూ కాశ్మీర్‌లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్న పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 28 మంది పర్యాటకులను పొట్టన బెట్టుకున్న తీవ్రవాదుల దుశ్చర్యను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబాలకు సానుభూతి తెలిపింది. ఈ దుశ్చర్యలకు పాల్పడిన ఉగ్రవాదం నశించాలని దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబి, మండల కార్యదర్శి ఆలేటి కిరణ్ లు మాట్లాడుతూ... ఇంతటి దారుణానికి పాల్పడిన కిరాతకులను పట్టుకుని శిక్షించాలని పేర్కొన్నారు.
అక్కడ పోలీసులు, భద్రతా దళాలు కేంద్ర ప్రభుత్వ అధీనంలో వున్నాయి. ఈ దాడికి పాల్పడిన వారిని పట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి దారుణమైన నేరాలకు పాల్పడేవారు దేశానికి, ముఖ్యంగా కాశ్మీర్ ప్రజలకు శత్రువులని పేర్కొన్నారు. పర్యాటకులతో రద్దీగా వుండే ప్రాంతాల్లో సరైన భద్రత లేకపోవడంతో సహా దాడికి సంబంధించిన పలు కోణాల్లో తక్షణమే సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.ఈ విషాద సమయంలో ఉగ్రవాద, ఛాందసవాద శక్తులకు వ్యతిరేకంగా దేశ ప్రజలకు సిపిఎం బాసటగా నిలబడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి కృష్ణ, మన్నెం మోహన్ రావు, సుల్తానా, సంధ్య, వెంకటమ్మ, ఆర్ బి జె రాజు, వజ్జా సురేష్, వీరయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు.