03-04-2025 11:58:08 PM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల: జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్ ల)ద్వారా సమర్థవంతమైన కార్యకలాపాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ తో కలిసి జిల్లా అధికారులు, నూతనంగా ఏర్పాటు అయిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను పునర్వ్యవస్థీకరించడం జరిగిందని, నూతనంగా ఏర్పడిన సంఘాల సమన్వయంతో సమర్థవంతమైన కార్యకలాపాలు నిర్వహించాలని తెలిపారు. గోదాముల నిర్వహణ, స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాల నిర్వహణ, ఇతర సంఘ విధులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి, జిల్లా సహకార అధికారి మోహన్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శంకర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.