16-03-2025 12:00:40 AM
కొందరు నిద్ర బాగా పడుతుందని మద్యం తాగుతుంటారు. నిజానికిది నిద్రకు చేటే చేస్తుంది. మద్యం మత్తులో నిద్ర ముంచుకొచ్చినా గాఢ నిద్ర కరవవుతుందని తెలుసుకోవాలి. రాత్రిపూట నిద్ర దశలు దశలుగా పడుతుంది. తొలి గంటల్లో తేలికైన నిద్ర, అనంతరం గాఢ నిద్ర పడుతుంది. ఒక్కో దశకు సుమారు 90 నుంచి 120 నిమిషాలు పడుతుంది. పడుకోవటానికి ముందు మద్యం తాగితే ఈ దశలకు అంతరాయం కలుగుతుంది.
ఫలితంగా గాఢ నిద్ర కొరవడుతుంది. తెల్లారి లేచాక చురుకుగా, ప్రశాంతంగా ఉండటానికి తోడ్పడేది ఈ గాఢ నిద్రే. మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, మానసిక ధోరణికీ ఇది కీలకమే. గాఢంగా నిద్ర పట్టకపోతే ఇవన్నీ అస్తవ్యస్తమవుతాయి. అందుకే మద్యం తాగిన తర్వాత 8 గంటల సేపు నిద్రపోయినా కూడా గాఢ నిద్ర కొరవడటం వల్ల మార్నింగ్ హుషారుగా అనిపించదు. అంటే ఎంత సేపు నిద్రపోయామనే దాని కన్నా ఎంత బాగా నిద్ర పోయామన్నదే ముఖ్యమన్నమాట. మరోవైపు మద్యంతో అప్పటికే ఉన్న గురక, నిద్రలేమి, పీడకల వంటి నిద్ర సమస్యలు కూడా తీవ్రమవుతాయి.