calender_icon.png 27 January, 2025 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు సమర్థవంతంగా కృషి

26-01-2025 06:31:36 PM

కొత్తగూడెం ప్రగతి మైదానంలో అంగరంగ వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, వివిధ శాఖల అధికారులతో కలిసి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల కవాతులో పాల్గొని, గౌరవ వందనాన్ని స్వీకరించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ప్రగతి పై వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి వివరించారు. ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు జిల్లా కలెక్టర్, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, ఎస్పీ రోహిత్ రాజ్, అదనపు కలెక్టర్ ఇంటి వేణుగోపాల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి ప్రశంసా పత్రాలు అందించారు. 

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థిని విద్యార్థులచే ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి నృత్యాలు అహుతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కూడా ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది. అనంతరం వివిధ శాఖల ద్వారా చేపట్టిన ప్రగతి నివేదికలను కలెక్టర్ జితేష్ వి పాటిల్ చదివి వినిపించారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకులకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మనల్ని మనం పరిపాలించుకోవడానికి దేశానికి రాజ్యాంగం అవసరమని భావించిన నాటి దార్శినికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసి రాజ్యాంగ ముసాయిదా కమిటి చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఎన్నుకున్నారు. డ్రాఫ్టింగ్ కమిటి రూపొందించిన రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి రావడంతో జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. రాజ్యాంగంలో ప్రజలకు అన్ని హక్కులను కల్పిస్తూ రాజ్యాంగాన్ని రూపొందించారు. బ్రిటీష్ పరిపాలన నుండి విముక్తి పొందిన తరువాత భారత పౌరులందరిని ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్య్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. రాజ్యాంగ రచనలో పాల్గొన్న మహానీయులందరికీ పేరు పేరున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.

ప్రజా సేవకులుగా, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న మన ఉద్యోగ జీవన ప్రయాణం ఫలప్రదం కావాలని, మన సేవా కాలం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. దేశ భక్తుల ఆశయాలు, త్యాగాల స్పూర్తితో మన సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ శుభతరుణంలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని ప్రజలకు తెలియచేశారు. నాలుగు సంక్షేమ పథకాలు అమలుకు శ్రీకారం:- పేదలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు క్షేత్రస్థాయి విచారణ నిర్వహించాం. క్షేత్రస్థాయి విచారణ అనంతరం 21 నుండి 24వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలలో ప్రజల సమక్షంలో పూర్తివివరాలతో గ్రామసభలు నిర్వహించి, ఇట్టి పథకాలకు జాబితాల్లో పేర్లు లేని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. సంక్షేమ పథకాలు అమలు చేయడం అనేది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు గ్రామసభల్లోను, ప్రజాపాలన సహాయ కేంద్రాల్లోను దరఖాస్తులు తీసుకుంటున్నాం. వచ్చిన ప్రతి ధరఖాస్తును జవాబుదారీ తనంగా రిజిష్టర్లులో నమోదు చేయడం జరిగిందన్నారు.