calender_icon.png 15 November, 2024 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రిస్టియన్ మిషనరీల విద్యా, వైద్య సేవలు భేష్

12-11-2024 01:16:36 AM

  1. మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ
  2. ఇక్కడ మత వివక్షకు తావు లేదు..
  3. కృతజ్ఞత మహిమోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): విద్యా, వైద్యరంగాల్లో క్రిస్టియన్ మిషనరీలు అందిస్తున్న సేవలు అభినందనీయమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విద్య వ్యాపారంగా మారిన సందర్భంలో మిషనరీలు అతి తక్కువ ఫీజుతో పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్నాయని కొనియాడారు.

బ్రదర్ డాక్టర్ పి.సతీష్‌కుమార్ వాక్యపరిచర్యకు 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ఎల్బీస్టేడియంలో నిర్వహించిన కృతజ్ఞత మహిమోత్సవానికి సీఎం ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు మిషనరీలు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాయన్నారు. సమాజంలో చెడు రూపుమాపి మంచిని పెంచేందుకు మిషనరీలు కృషి చేస్తున్నాయన్నారు.

కల్వరి టెంపుల్‌ను అంత గొప్పగా నిర్వహించడం బ్రదర్ సతీష్‌కుమార్‌కే సాధ్యమైందని కొనియాడారు. రాష్ట్రానికి గంజాయి, డ్రగ్స్ పీడ విరగడయ్యేలా దైవదూతగా పనిచేయాలని, సామాజిక బాధ్యతగా తీసుకుని తన వంతు పనిచేయాలని సతీష్‌కుమార్‌కు సూచించారు.

తెలంగాణ మత సామరస్యానికి ప్రతీక అని, ఇక్కడ మత వివక్షకు తావు లేదని స్పష్టం చేశారు. ప్రతి మతానికి, వర్గానికి సమానమైన గౌరవం ఉంటుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పదవాడికి సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీకి క్రిస్టియన్లంతా మద్దతు ఇవ్వాలని కోరారు.

రాహుల్‌గాంధీ ఇప్పటికే భారత్ జోడో యాత్ర నిర్వహించారని, ఆయన ప్రధాని అయ్యేందుకు క్రిస్టియన్లు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. వేడుకలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.